భారత దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థ, ప్రభుత్వ సిటీ కళాశాల అని, ఈ కళాశాల అంతర్జాతీయ స్థాయి ప్రముఖులను, విద్యావేత్తలను, క్రీడాకారులను, సామాజిక వేత్తలను అందించిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సిటీ కళాశాల, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన శత వసంతాల వేడుక మెగా ఫెస్ట్ 2022 ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, సిటీ కళాశాలలో చదువుకోవటం మధురమైన అనుభూతి అన్నారు. విద్య అంటే కేవలం డిగ్రీలు సంపాదించటం మాత్రమే కాదని, సామాజిక స్పృహ, సాంస్కృతిక దృష్టి, చారిత్రక దృక్కోణం అలవరచుకుని దేశ పునర్నిర్మాణంలో క్రీయాశీలంగా పాల్గొనాలని అన్నారు. అందుకు సిటీ కళాశాలే మంచి ఉదాహరణ అని, దేశంలో ఏ ఉద్యమం జరిగినా, తొలి అడుగు సిటీ కళాశాల నుండే పడిందని గుర్తు చేశారు. ఈ స్ఫూర్తిని ఇప్పటి తరం కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు.
సిటీ కళాశాల భవన నిర్మాణ శైలి చార్మినార్ లాగా విలక్షణమైనదని, ఈ కళాశాల సమీపం నుండి వెళ్తుంటే చూపరులను ఆకట్టుకుంటుందని, సందర్శకులకు ఒక మంచి విజ్ఞాన కేంద్రంగా అనుభూతి మిగుల్చుతుందని అన్నారు. నిజాముల దార్శనిక దృష్టితో విద్యావైద్యన్యాయరంగాలలో ప్రపంచ స్థాయి ప్రగతి సాధ్యమైందని కొనియాడారు. మత సామరస్యానికి, స్నేహ సౌహార్థానికి, సమైక్య భావనకు హైదరాబాదు నగరం కేంద్రమని సిటీ కళాశాల అందుకు ప్రేరణగా నిలిచిందని ఈ సందర్భంగా ప్రశంసించారు. రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మాత్రమే సిటీ కళాశాలలో సీటు లభించటం, కళాశాల ఉన్నతిని తెలియజేస్తుందని, నా మనవడు తరం కూడా ఈ విద్యాసంస్థలోనే విద్యను అభ్యసిస్తే వాళ్ళు సామాజిక స్పృహతో ఉత్తమ పౌరులుగా రాణిస్తారన్నారు.
వందేళ్ల ఉత్సవాల సందర్భంగా కళాశాలకు 100 గదులతో కొత్త భవనం – కళాశాల విద్యాశాఖ కమీషనర్ నవీన్ మిత్తల్
సమాజంలో ఏ రంగంలో ప్రముఖులను చూసినా తప్పనిసరిగా సిటీ కళాశాల పూర్వవిద్యార్థులు కనిపిస్తారని, ఈ ఒరవడికి కొనసాగింపుగా ఇటీవల లండన్ లో జరిగిన 2022 కామన్ వెల్త్ క్రీడల్లో కళాశాల విద్యార్ధిని బేబీ రెడ్డి కాంస్య పతకం సాధించిందని గౌరవ అతిధిగా పాల్గొన్న కళాశాల విద్యాశాఖ కమీషనర్ నవీన్ మిత్తల్ కొనియాడారు. ఈ కళాశాల పట్ల విద్యార్ధులకు, తల్లితండ్రులకు ఉన్న నమ్మకం దోస్త్ సీట్ల కేటాయింపు ద్వారా తెలుస్తున్నదని, ఇటీవల మొదటి విడత ప్రవేశాల్లో సిటీ కళాశాలకు అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. రాష్ట్రంలో అధిక సంఖ్యలో పిహెచ్ డి డిగ్రీ కలిగిన ఆచార్యులు. సిటీ మొదటి కళాశాలలో ఉన్నారని, అందువలన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ కళాశాలకు పరిశోధన కేంద్రం కేటాయించిందని తెలిపారు.
కేవలం విద్యకు పరిమితం చేయక, విద్యార్థులలో ఉన్న అంతర్గత కళలను వెలికి తీస్తూ, ప్రదర్శనలను ఏర్పాటు చేస్తూ వారిలో గొప్ప చైతన్యాన్ని, స్ఫూర్తిని నింపుతున్న ప్రిన్సిపాల్, అధ్యాపక బృందాన్ని ఆయన అభినందించారు. నిరంతర అధ్యయనం, అకుంఠిత శ్రమ ద్వారానే అత్యున్నత స్థాయికి ఎడగవచ్చని, ఇప్పటి విద్యార్ధులు అలా రాణించి మళ్ళీ 125 సంవత్సరాల వేడుకలో పూర్వ విద్యార్ధులుగా భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. వందేళ్ల ఉత్సవాల సందర్భంగా కళాశాలకు 100 గదులతో కొత్త భవన నిర్మాణానికి అనుమతినిస్తూ అవసరమైన ఉత్తరువులు జారీ చేశామని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్ధులు లావణ్య, పావని, శ్వేత, సౌమ్యలు ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శన నవీన్ మిత్తల్ ప్రారంభించి వారిని అభినందించారు.
రాజనీతిజ్ఞుల కన్నతల్లి సిటీ కళాశాల చార్మినార్ శాసన సభ్యులు జనాబ్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఈ కార్యక్రమంలో మరొక అతిధిగా పాల్గొన్న చార్మినార్ శాసన సభ్యులు జనాబ్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ, ఈ కళాశాల తనలాంటి రాజకీయనాయకులను, మంత్రులను తయారుచేసిందని, తనే కాక తన కుటుంబంలోని ఎందరో ఈ కళాశాలలో చదువుకుని దేశవిదేశాలలో ఉన్నత స్థానాలలో స్థిరపడ్డారని అన్నారు. ఈ కళాశాల నగర ఔన్నత్యానికి తార్కాణంగా నిలిచే సంస్థలలో ప్రసిద్ధమైనదని అన్నారు.
సిటీ కళాశాలలో పరిశోధనా కేంద్రం ఏర్పాటు
ఆత్మీయ అతిదిగా పాల్గొన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి.రవీందర్ మాట్లాడుతూ. దేశమంతా స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ సిటీ కళాశాల శతాబ్ది వేడుకలు జరుపుకోవటం మంచి అనుభూతి అన్నారు. వందేమాతర ఉద్యమం, తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమాలలో సిటీ కళాశాల కీలక భూమిక పోషించారని, ఈ స్ఫూర్తిని ఇప్పటి విద్యార్ధులు అందుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో విశిష్ట అతిధిగా పాల్గొన్న తెలంగాణ సాహిత్య అకాడెమీ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ తొలిదశ తెలంగాణ ఉద్యమానికి సిటీ కళాశాల ఉద్యమ క్షేత్రంగా ప్రఖ్యాతి గాంచిందని, చదువుతో పాటు సామాజిక దృక్పధాన్ని విద్యార్థులకు కలిగిస్తుందని అన్నారు. తెలుగు సాహితీ వేత్తలు, కవులు, కళాకారులకు సిటీ కళాశాల పెట్టనికోట అన్నారు. విద్యార్థుల్లో స్థానిక మూలాల ఎరుక, దారిత్రక దృష్టి పెంపొందింప చేయడానికి డిగ్రీ విద్యార్థులచేత “మన ఊరు-మన చరిత్ర” ప్రాజెక్టును తెలంగాణ సాహిత్య అకాడెమీ చేపట్టిందని, అందుకు కళాశాల విద్యాశాఖ సహకారం అందిస్తున్నదని, అందుకు కమీషనర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.బాల భాస్కర్ మాట్లాడుతూ వందేళ్ల చారిత్రక సందర్భంలో తాను కళాశాలకు: ప్రిన్సిపాల్ ఉండటం అదృష్టమని, కళాశాల ఘనా కీర్తిని ఈ తరం వారికి అందికృతమ్ కోసమే ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా 26 వ తేదీ పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం, 27వ తేదీ బహుమతీ ప్రధానం, భాషా సాంస్కృతిక శాఖ కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనాలుంటాయని తెలిపారు. విద్యార్థుల చిత్రకళా ప్రదర్శన విశేషంగా ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి.. జాజ్ సుల్తానా, సీనియర్ అధ్యాపకులు డా.ఇ.యాదయ్య, డా.జె.రత్నప్రభాకర్ తదితరులు, బోధన,, బోధనేతర, విద్యార్థులు పాల్గొన్నారు.
Also Read : ఎనిమిదేండ్లలో అనేక అభివృద్ధి పనులు : మంత్రి నిరంజన్ రెడ్డి