తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు సాయం కంటే కేంద్ర ప్రభుత్వం ఎరువుల సబ్సిడీతో ఇచ్చే సాయం ఎక్కువన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలో రైతులకు ప్రతీ ఎకరానికి రూ.18, 254 ఎరువుల సబ్సిడీ కింద కేంద్రం అందిస్తోందన్నారు. “అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరుసగా పంట చేతికొచ్చే సమయానికి.. కళ్లాల్లో ఉన్నప్పుడు రైతులు నష్టపోతున్నారు. కాని ప్రభుత్వం నుంచి రైతులకు ఎలాంటి సహకారం అందడం లేదు. దీంతో తీవ్రమైన ఇబ్బందులు రైతులు ఉన్నారు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతు బీమా పథకం ద్వారా వారికి చేయూత నిస్తున్నారు. కాని తెలంగాణలో పంటల బీమా పథకం అమలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పంటల బీమా పథకం సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. తెలంగాణలోని కొంతమంది రైతులు స్వయంగా బీమా పథకం కట్టుకోవడం ద్వారా నిలదొక్కుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం పంటల బీమా పథకం అమలు చేయాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్రంపై వరుస పెట్టి విమర్శించడానికి కల్వకుంట్ల కుటుంబానికి సమయం సరిపోవడం లేదు.
రాష్ట్ర పరిపాలనపై దృష్టి పెట్టని కేసీఆర్ సలహాదారులకు రాష్ట్రాన్ని అప్పగించి.. ఆయన మహారాష్ట్రలో బీఆర్ఎస్ బ్రాంచ్ పెట్టుకున్నారు. బీఆర్ఎస్ లో ఎవరినైనా చేర్చుకోండి.. కాని తెలంగాణ పరిస్థితి ఏమిటి..? విద్యార్థుల పరిస్థితి ఏమిటి..? టీఎస్పీఎస్సీ పరిస్థితి ఏంటి..? దీని వదిలేసి తాను దేశ్ కీ నేత అని చెప్పుకుంటున్నారు. ఫ్లెక్సీలపై వేస్తే దేశ్ కీ నేత అవ్వరు.” అని అన్నారు కిషన్ రెడ్డి.
“బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో రైతుల జీవన శైలి మారిపోయిందని కేసీఆర్ అంటున్నారు. రైతుకు 10 వేల రూపాయలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం రైతు బంధు పేరుతో 10 వేలే ఇస్తుంది.. కాని కేంద్ర ప్రభుత్వం ఒక్క ఎరువుల సబ్సిడీ మీదనే రైతులకు ప్రతీ ఎకరాకు 18,254 రూపాయలు అందిస్తోంది. ఏడాదికి రెండు పంటలకు 4 యూరియా బస్తాలు అవసరం అవుతాయి. 4 బస్తాలు యూరియాపై కేంద్రం 8,568 రూపాయల సబ్సిడీ అందజేస్తోంది. అలాగే 4 బస్తాల డీఏపీకి 9,680 రూపాయలు కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. మొత్తంగా ఎరువలపైనే 18,254 సబ్సిడీ కేంద్రం అందిస్తోంది. కేసీఆర్ ఉచితంగా ఎరువులు ఇస్తానని చెప్పి ఎన్ని రోజులు అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా , యుక్రెయిన్ యుద్ధం, ఆర్థిక మాద్యం కారణంగా యూరియా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అయినా రైతులపై అదనపు భారం పడకుండా కేంద్రం చర్యలు చేపడుతోంది. పెరిగిన ధరలకు అనుగుణంగా కేంద్రం సబ్సిడీ ప్రకటిస్తుంది. ఒక యూరియా బస్తాపై ఒక రైతు రూ. 266 చెల్లిస్తారు. కేంద్రం ఇచ్చే సబ్సిడీ ఒక యూరియా వస్తాకి రూ. 2142. ఈ భారాన్ని కేసీఆర్ సర్కార్ భరిస్తానని చెప్పారు. మరి ఆ హామీ ఏం అయ్యింది. ఇది రైతులను మోసం చేసినట్టు కాదా..? . ఇదేదో కొత్త విషయంగా కాదు. డీఏపీ బస్తాపై మొత్తం క్లియర్ గా ఉంటుంది. యూరియా, డీఏపీ ఏడాదికి మొత్తం 18, 254 కేంద్రం ఇస్తుంటే .. మీరు ఏం ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రమాణం స్వీకారం చేయకముందే చేసిన హామీలను కేసీఆర్ తుంగలో తొక్కారు. దళితులను సీఎం చేస్తానని మాట తప్పారు. దళితులను మోసం చేశారు. అదే విధంగా రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్, వైద్యం, మౌలిక వసతులు, గ్రామ పంచాయతీల అభివృద్ధి, మున్సిపాలిటీ అభివృద్ధిపై గాని .. ఏ విషయంలోనూ కేసీఆర్ మాట నిలబెట్టుకోలేదు. ఇప్పుడు మహారాష్ట్రకు వెళ్లి మోడీని విమర్శిస్తున్నారు. అధికారం ఇచ్చాం కాబట్టి.. హామీలు నెరవేర్చండి.. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎంగిరిందనే సామెత ఉన్నట్టు కేసీఆర్ మాటలున్నాయి. ” అని అన్నారు కిషన్ రెడ్డి.
“ప్రధాని మోడీ డిజిటల్ విప్లవం తీసుకురావడంతో పాటు సంక్షేమ పథకాలు వందకు వంద శాతం పేదలకు అందేలా చేస్తున్నారు. ప్రపంచంలో డిజిటల్ ట్రాన్షాక్షన్ లో భారత దేశం ఫస్ట ప్లేస్ లో ఉంది. అలానే యూరియాకు కూడా మధ్య దళారిలు లేకుండా.. వేప పూత పూసిన యూరియా రైతులకు అందుతోంది. వేప పూత పూసిన యూరియా వాడటం వల్ల పంటల ఉత్పత్తి మెరుగైంది. అలాగే ప్రజాధనం వృధా కాకుండా దళారీలు లేకుండా రైతులకు నేరుగా సబ్సిడీ అందిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు డబ్బా కొట్టుకోవడం తప్ప కేసీఆర్ హామీలు నెరవేర్చరు. ఇప్పుడు నేరుగా రైతుల అకౌంట్లలోనే నేరుగా నగదు జమా అవుతోంది. గతంలో రైతులు తమ ఉత్పత్తులను ఆ జిల్లాలోనే, ఆ రాష్ట్రంలోనే అమ్ముకోవాలనే రూల్ ఉండేది కాదు. కాని ఇప్పుడు రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఆ సౌకర్యం మోడీ సర్కార్ కల్పించింది. అలాగే ఎంఎస్పీని కేంద్రం పెంచింది. భూసార పరీక్షలు నిర్వహించడం ద్వారా.. ఎలాంటి పంటలు వేయొచ్చు రైతులకు సూచిస్తున్నారు. కేంద్రం సబ్సిడీ ధరల్లో ఇస్తున్న ట్రాక్టర్లను టీఆర్ఎస్ నాయకులు నిజమైన రైతులకు అందకుండా బంధువులకు ఇచ్చారు. మూతపడిన ఎరువుల పరిశ్రమలను కొత్త టెక్నాలజీతో కేంద్రం పునరుద్దరించింది. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని 6,180 కోట్ల రూపాయలతో పునరుద్ధరించి.. ప్రజలకు అంకితం చేస్తే.. కేసీఆర్ కు రావడానికి సమయం లేదు. కాని నాందేడుకు వెళ్లడానికి, మోడీ గారిని తిట్టడానికి కేసీఆర్ కు సమయం ఉంటుంది. కేంద్రం ఇచ్చే సబ్సిడీ వల్ల ఉత్పత్తి పెరుగుతుంది. నిర్మాణాత్మకంగా సబ్సిడీ అందిస్తోంది కేంద్రం. ఎరువుల సబ్సిడీ కౌలు రైతులకు లాభయం చేకూరుతుంది. తెలంగాణ ప్రభుత్వం బీనామీ పేర్లతో ఉన్న వారికి.. డబ్బున వారికి డబ్బులు ఇస్తోంది. వ్యవసాయం చేసినా.. చేయకపోయినా.. వారికి డబ్బులు ఇస్తున్నారు. కాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిజంగా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో.. వారు చిన్న రైతు, పెద్ద రైతు అనే తేడా లేకుండా 18,254 రూపాయలు ఎరువుల సబ్సిడీ అందిస్తోంది. సుమారు 12 కోట్లకు పైగా రైతులు సబ్సిడీ పొదుతున్నారు. రైతులకు క్రాప్ లోన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు. వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అన్నారు.