Petro Bomb: ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే కేంద్రం పెట్రోలు, డీజిల్ రేట్లను పెంచుతుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల కోసమే గతంలో రేట్లు తగ్గించారని, మార్చి 10న ఓట్లు డబ్బాలో పడగానే పెట్రో ఉత్పత్తులు, గ్యాస్ రేట్లు పెంచుతారని అయన అనుమానం వ్యక్తం చేశారు. పాత వరంగల్ జిల్లాలో హరీష్ రావు సుడిగాలి పర్యటన చేశారు. నర్సంపేట్ లో పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టారు. కమ్యూనిటీ హాస్పిటల్ ను రూ. 58 కోట్ల అంచనా వ్యయంతో జిల్లా స్థాయి ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు, రూ. 1.25 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే టి. డయాగ్నస్టిక్ సెంటర్, రూ. 4 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే 25 హెల్త్ సబ్ సెంటర్లకు హరీష్ రావు శంఖుస్థాపన చేశారు.
అనంతరం ములుగు జిల్లా కేంద్రంలో 41.18 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతోన్న ముగులు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రి విస్తరణ పనులకు శంఖుస్థాపన చేశారు. ప్రస్తుతం 100 పడకలు ఉన్న ఆస్పత్రిని అదనంగా 230 పడకలతో మొత్తంగా 330 పడకలకు అప్ గ్రేడ్ చేయనున్నారు. వైద్యశాలలో ఆక్సిజన్ ప్లాంట్, ఐసియూ యూనిట్ ను ప్రారంభించారు.
నర్సంపేట్ లో జరిగిన బహిరంగ సభలో హరీష్ రావు ప్రసంగిస్తూ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు అమలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రైతుల బావులవద్ద, బోర్ల వద్ద మీటర్లు పెడితే ఏటా ఐదు వేలకోట్ల చొప్పున ఐదేళ్ళలో 25 వేల కోట్ల రూపాయలు ఎఫ్.ఆర్.బి.ఎం రుణ పరిమితిని పెంచుతామని కేంద్ర ఆర్ధిక మంత్రి చెబుతున్నారని వెల్లడించారు. పేదలకు వ్యతిరేకమైన ఇలాంటి సంస్కరణలు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసేది లేదని స్పష్టం చేశారు. తన బొందిలో ప్రాణం ఉండగా ఇలాంటి పని చేయబోమని సిఎం కెసిఆర్ కూడా చెప్పారని హరీష్ గుర్తు చేశారు.
బిజెపి పాలిస్తున్న రాష్టాల్లో, మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కానీ, ఉత్తర ప్రదేశ్ లోగానీ, కాంగ్రెస్ పాలిత పంజాబ్, మహారాష్ట్ర ల్లో కూడా ఉచిత విద్యుత్ పథకం లేదని, కానీ 24 గంటలపాటు రైతులకు ఉచిత, నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా అని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర రావు, సత్యవతి రాథోడ్, రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపిలు కవిత, పసునూరి దయాకర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.