కిట్టూ పోస్టు కార్డుకి కృతజ్ఞతలు!

ఉత్తరం. చిన్న మాటే కావచ్చు. కానీ ఎంతమందిని ఈ మాటే ఎమోషనల్ గా కట్టిపడేస్తుందో కదూ. ఒకానొకప్పుడు ఉత్తరాలే మనసుకి అన్నీనూ….ఉత్తరం తెచ్చే పోస్ట్‌మ్యాన్‌ని కూడా ఓ సన్నిహితుడిలా చూసిన వారున్నారు.

ప్రతి ఏటా డిసెంబరు ఏడవ తేదీని “నేషనల్ లెటర్ రైటింగ్ డే”గా జరుపుకుంటారు. ప్రముఖ ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ రిచర్డ్ వల్లే “లెటర్ డే” ప్రపంచానికి పరిచయమైంది.

పురాతన కాలంలో తాటి ఆకులపై రాసేవారు. తర్వాత్తర్వాత కాగితాల వాడుక వచ్చింది. ఉత్తరాలు రాయడమనేదో ప్రత్యేక కళ. “క్షేమం” అనే పదబంధం లాంఛనప్రాయమైనప్పటికీ, శ్రేయోభిలాషుల క్షేమాన్ని తలచుకుంటూ పరస్పరం ఉత్తరాలు రాసుకోవడంలో ఎంత ఆనందముంటుందో చెప్పలేం. ఉత్తరం రాసేవారికి ఎంత ఆనందముంటుందో అంతకన్నా ఎక్కవ ఆనందమే ఉంటుంది ఆ ఉత్తరాన్ని అందుకున్న వారికి.

ఇ-మెయిల్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాల మాటెలా ఉన్నా నాకిప్పటికీ ఉత్తరం అందుకున్నప్పుడు, పాత ఉత్తరాలు మరొక్కసారి చదివినప్పుడు ఎంత ఆనందమేస్తుందో మాటల్లో చెప్పలేను.

ఇటీవల ఓ ఉత్తరం చదివాను. అదొక పోస్టు కార్డు. ఆ కార్డు వయస్సు అరవై ఏళ్ళు దాటింది. ఆ ఉత్తరం నాకొచ్చిన ఉత్తరం కాకపోవచ్చు కానీ అది చదువుతుంటే ఆ ఇద్దరు వ్యక్తులతోపాటు మనసు తిరువణ్ణామలైకి వెళ్ళిపోయింది. కారణం ఆ పోస్టు కార్డు రాసిందెవరో కాదు తెలుగు వచనానికి తమ శైలితో ఓ అందం చందం తీసుకొచ్చిన సుప్రసిద్ధ రచయిత చలంగారు (గుడిపాటి వేంకటచలంగారు). కథలూ నవలలూ అనువాదాలూ మ్యూజింగ్స్, ప్రేమలేఖలు వంటి వాటితో తెలుగు సాహిత్యంలో తమకంటూ సుస్థిర స్థానం సంపాదించుకున్న చలంగారు ఎందరికి ఉత్తరాలు రాసారో లెక్కేలేదు. తమకు ఉత్తరం అందిన ప్రత్యుత్తరం రాయడానికి ఆలస్యం చేసేవారు కాదు. ఆయన అందరికీ ఉత్తరాలు రాస్తుండటాన్ని చూసిన ఓ చిన్నమ్మాయి తనకెందుకు రాయవని అడిగింది. ఇంతకూ ఆ అమ్మాయి చలంగారింటే పెరిగింది. పేరు కస్తూరి. అప్పటికింకా ఆరేడేళ్ళే అయి ఉండొచ్చు. అడిగింది చిన్నమ్మాయే కదాని నిర్లక్ష్యం చేయక ఆయన ఓ పోస్టు కార్డు రాసారు. ఆ పోస్టు కార్డు ఉంటే పంపగలవా అని మాటల సందర్భంలో అడిగ్గా కిట్టూ ఆనబడే కస్తూరి ఫోటో తీసి వాట్సప్ లో పంపింది. ఆ కార్డుని చూడగానే ఎంత సంబరపడిపోయానో చెప్పలేను. నాకే ఇంత ఆనందం వేస్తే కిట్టూ ఆనందం అవధుల్లేనిదే. చలంగారు కిట్టూకి మే పదో తేదీన రాసారు. అందులోని మాటలిక్కడ….

Chalam Post Cards

“కిట్టూకి
నీ మొహమంతా ఏమిటి అట్లా ఎర్రగా పూసుకున్నావు?
కుంకమా? పువ్వులా?
హైద్రాబాదు నించి జిలేబి
ఎప్పుడు పంపిస్తావు?
మీనాకి ఒక ఆడ దూడ పుట్టింది.
మీనా పాలతో నర్తకి గులాబ్ జాం చేస్తుంది.
నీకు ఎన్ని గులాబ్ జాంలు కావాలి?
కుల్లాగాడిని వాడి అమ్మ బాగా తన్నింది.
ఏడుస్తున్నాడు.
చిన్న పిట్ట ఎండకి నోరు తెరిచి గంతులేస్తోంది.
నువ్వు అందర్నీ గిల్లకు. కొట్టకు. అందరితో చక్కగా ఆడుకో.

ఈశ్వరాశీర్వాదాలతో
నాన్న

చలం అని సంతకం చేయకుండా ” నాన్న” అని రాసారేంటీ అని అడగొచ్చు. చలంగారిని రమణస్థాన్ (చలంగారు నివసించిన ఇంటి పేరు) లో అందరం నాన్న అనే పిలిచేవారు.

ఇన్ని మాటలెలా రాయించిన అలనాటి పోస్టు కార్డుకీ, ఆ కార్డుతోపాటు కొన్ని అరుదైన ఫోటోలూ పంపిన కిట్టూకీ కృతజ్ఞతలు. చలంగారికి మనఃపూర్వక నమస్సులు.

– యామిజాల జగదీశ్

Also Read : వింటే పురాణం వినాలి…తింటే గారెలే తినాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *