ఓబీసీ రిజర్వేషన్లలో భారీ మార్పులకు కేంద్రం తెరతీస్తున్నట్టు వస్తున్న వార్తలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై రోహిణి కమిషన్ కేంద్రానికి ఇటీవల నివేదిక సమర్పించినప్పటికీ అందులోని అంశాలను ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. బీసీ కులగణనపై తాత్సారం చేస్తున్న కేంద్రం రిజర్వేషన్ల అమలులో మార్పులకు మాత్రం ఉరుకులు పరుగులు తీయడంపై పలువురు మండిపడుతున్నారు. 2017లో ఏర్పడిన రోహిణి కమిషన్ 17 సార్లు గడువు పొడిగింపు తర్వాత ఎట్టకేలకు గతనెల తన తుది నివేదిక సమర్పించింది. కమిషన్ సిఫారసులపై అధికారికంగా సమాచారం లేనప్పటికీ ప్రస్తుత 27 శాతం రిజర్వేషన్ పంపిణీని సమూలంగా మారుస్తున్నట్టు తెలుస్తున్నది. కొన్ని సామాజిక వర్గాలు అధిక ప్రయోజనాలు పొందుతున్నాయని, మరికొన్ని రిజర్వేషన్లకు ఆమడదూరంలో ఉండిపోయాయని కమిషన్ తేల్చినట్టు వినవస్తున్నది. ఈ 27 శాతాన్ని మూడుగా విభజించారు. ఏమాత్రం ప్రయోజనం పొందని సామాజిక వర్గాలకు 10 శాతం, అంతంతమాత్రం ప్రయోజనం పొందిన వర్గాలకు 10 శాతం, గరిష్ఠ ప్రయోజనాలు పొందిన వర్గాలకు మిగిలిన 7 శాతం పంచాలని కేంద్రం చూస్తున్నట్టు తెలుస్తున్నది.
అయితే బీసీ కులగణన జరుగకుండా ఈ తరహా పంపకాలు చేపట్టడం నిరర్థకమని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వంగల ఈశ్వరయ్య మండిపడ్డారు. కమిషన్ సిఫారసులను బుట్టదాఖలు చేయాలని ఆయన తేల్చి చెప్పారు. సర్వే అనేదే లేకుండా కులానికి ఎంత ప్రయోజనం దక్కిందో ఎలా నిర్ధారిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. అఖిల భారత బీసీసమాఖ్య అధ్యక్షుడు హన్స్‌రాజ్ జాంగ్రా కూడా ఇదేతరహాలో స్పందించారు. కులగణన జరపడమే పరిష్కారమని స్పష్టం చేశారు. కమిషన్ 1931 జనాభా లెక్కల ఆధారంగా పంపిణీని నిర్ధారించిందని, ఈ నేపథ్యంలో కమిషన్ సిఫారసులు ఎంత కచ్చితంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చని డీఎంకే రాజ్యసభ ఎంపీ పీ విల్సన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం దగ్గర 2015 డాటా ఉన్నప్పటికీ ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు. 90 ఏండ్ల నాటి డాటా ఆధారంగా రూపొందిన సిఫారసుల వల్ల చాలామందికి నష్టం వాటిల్లే ప్రమాదముందని అఖిల భారత ఓబీసీ ఉద్యోగుల సమాఖ్య కార్యదర్శి జీ కరుణానిధి ఆందోళన వ్యక్తం చేశారు. 2,600 ఓబీసీ కులాల్లో 15 కులాలు 25 శాతం రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో సీట్లు పొందగలుగుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఎంతమాత్రమూ సరికాదని, కుల గణన జరిగిన తర్వాతే రోహిణి కమిషన్ నివేదికను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ అత్యధికంగా వెనుకబడ్డ వర్గాల ఓట్ల మీద ఆశతో ఈ ఎజెండాను కేంద్రం ఎత్తుకున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీకి కలిగే ఎన్నికల ప్రయోజనం ఎలా ఉన్నప్పటికీ ఈ వ్యవహారం బీసీ తేనెతుట్టెను కదుపుతుందని అంటున్నారు. బీసీల మధ్య అంతర్గతంగా తగాదాలు పెట్టి విభజించడం బీజేపీ లక్ష్యమా? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమంటే 2011 జనాభా లెక్కలపై జరిపిన సామాజికార్థిక సర్వే నివేదికను రోహిణి కమిషన్‌కు అందజేయలేదని కేంద్రం పార్లమెంటుకు లిఖిత సమాధానంలో తెలిపింది. బీసీ కులగణన లేకుండా, సర్వే సమాచారం లేకుండా రిజర్వేన్ల పంపిణీ ఎలా చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. వచ్చే 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో రోహిణి కమిషన్ నివేదికను కేంద్రం సమర్పించే అవకాశాలున్నాయని అంటున్నారు.