Thursday, April 25, 2024
HomeTrending Newsడిజిపిని వెనక్కు పిలవాలి: బాబు డిమాండ్

డిజిపిని వెనక్కు పిలవాలి: బాబు డిమాండ్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కోరారు. రాష్ట్రంలో వెలుగు చూస్తున్న డ్రగ్స్, గంజాయి మాఫియాను వెంటనే అరికట్టకపోతే అది ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించి దేశ సమగ్రత, సమైక్యతలకే ముప్పు ఏర్పడుతుందని అయన ఆందోళన వ్యక్తం చేశారు, అందుకే రాష్ట్రంలో వెంటనే 356 అధికరణ ప్రయోగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న గంజాయి, డ్రగ్స్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సమగ్ర విచారణ జరిపించాలని, తమ పార్టీ కార్యాలయంపై దాడి ఘటనను సిబిఐతో విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని  రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో  చంద్రబాబు నేతృత్వంలోని టిడిపి బృందం సమావేశమైంది.  అనంతరం బాబు మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర డిజిపి గౌతమ్ సావాంగ్ ను వెనక్కు పిలిచి, అతనిపై విచారణ జరిపించాలని కోరారు. డిజిపి ‘స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం’ లో భాగస్వామిగా ఉన్నారని, ముఖ్యమంత్రితో కలిసి, పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించి, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారని, మాట్లాడే స్వేఛ్చ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. చేసిన తప్పుకు డిజిపి కి కూడా శిక్ష పడాల్సిందేనని  బాబు తేల్చి చెప్పారు.

రాష్ట్రంలో రాజ్యంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, రాష్ట్ర ఎన్నికల సంఘం, పబ్లిక్ సర్వీస్ కమిషన్, శాసన మండలిపై దాడులు చేశారని, జడ్జిలపై అసభ్య పదజాలంతో దూషిస్తూ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారని బాబు ఆరోపించారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యమేలుతోందని, ‘స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం’ జరుగుతోందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడ్డా వాటి మూలాలు ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉన్నాయని, రాష్ట్రంలో 25 వేల ఎకరాలో గంజాయి సాగుతోందని, దీని విలువ 8 వేల కోట్ల రూపాయలని వివరించారు. ముంద్రా పోర్టులో మూడు కిలోల హెరాయిన్ పట్టుకున్నారని, అక్కడ దొరికిన డ్రగ్స్ విలువ దాదాపు 21 వేల కోట్ల రూపాయలు ఉంటుందని, దాని మూలూలు కూడా విజయవాడలోనే ఉన్నాయని బాబు అన్నారు.

రాష్ట్రంలో మధ్య నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చిన వైసీపీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం  ధరలు మూడు నాలుగు రెట్లు పెంచారని, దేశంలో ఎక్కడా లేని బ్రాండ్స్ రాష్ట్రంలోకి వచ్చాయని, వాటిని తాగిన ప్రజల ఆరోగ్యం పాడవుతుందని వివరించారు. అపాయింట్మెంట్ దొరికితే ప్రధానమంత్రి, హోం శాఖ మంత్రి లను కూడా కలుసుకుని రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వివరిస్తామని బాబు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్