Sunday, September 22, 2024
HomeTrending Newsబాబువి ఎబ్బెట్టు రాజకీయాలు: పేర్ని విమర్శ

బాబువి ఎబ్బెట్టు రాజకీయాలు: పేర్ని విమర్శ

చంద్రబాబు హయాంలో తిరుపతిలో నాటి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై రాళ్ళ దాడి జరిగినప్పుడు పోలీసు వ్యవస్థ ఏమయ్యిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. చందబాబు బంద్ పిలుపు ఇస్తే కనీసం అయన సొంత హెరిటేజ్ షాపులు కూడా మూయలేదని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. పట్టాభి మాటలను సమర్ధిస్తూ మీరు దీక్ష చేస్తున్నారా అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. ఈ దీక్ష ఎందుకోసం, ఎవరికోసం చేస్తున్నారని, నక్క వినయాలు, కొంగ జపాలు ఇక చాలించాలని హితవు పలికారు. గతంలో ఒక వ్యక్తి ఈ తరహా దూషణలు చేసినప్పుడు తమ పార్టీ శ్రేణులు పట్టించుకోలేదనే మళ్ళీ పట్టాభితో ఇలా మాట్లాడించారని అనుమానం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో 356 అధికరణ ప్రయోగించి రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేయడంలో అర్ధం లేదన్నారు. ఢిల్లీ వెళ్లి అమిత్ షా ను కలుస్తామని చెబుతున్నారని, గతంలో జరిగిన సంఘటనలు ఆయనకు గుర్తుండవా, ఒక్కవేల నిజంగా మీకు అమిత్ శా అపాయింట్మెంట్ ఇస్తే, మీరు గతంలో చేసిన పనులకు నోటి నిండా గడ్డి పెట్టి పంపిస్తారని నాని హెచ్చరించారు. పట్టాభి వ్యాఖ్యలను సమర్ధిస్తూ పయ్యావుల కేశవ్ చేసిన వాదనను పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఆ పదానికి అర్ధం అమాయకుడని కేశవ్ చెప్పారని, అంటే పయ్యావుల బద్మాష్ అని అనుకోవచ్చా అని నాని నిలదీశారు.

తెలుగుదేశం పార్టీని తాము ఏమీ చేయాల్సిన అవసరం లేదని, పైన ఉన్న ఎన్టీఆర్ శాపాలు ఉన్నాయని, దానితో పాటు మీ పుత్రరత్నం లోకేష్ చాలని… పార్టీ ఆఫీసుకు తాళాలు వేసే పని లోకేష్ చేస్తారని, దానికి ఎవరూ ఏమీ చేయక్కర్లేదని బాబునుద్దేశించి వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఎప్పుడో టిడిపికి దూరమయ్యాయని, సంప్రదాయంగా ఆ పార్టీకి ఎప్పటినుంచో అండగా ఉన్న సామాజిక వర్గాలు కూడా వీడిపోయాయని స్పష్టం చేశారు.

చంద్రబాబు 75 ఏళ్ళ వయసులో ఈ తరహా ఎబ్బెట్టుగా రాజకీయాలు చేయడం సిగ్గుచేటని, ఇన్ని కుట్రలు, నీచమైన పనులు ఎవరికోసం చేస్తున్నారని అడిగారు. ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనేది ఎన్టీఆర్ సిద్ధాంతమని, అయనకు వెన్నుపోటు పొడిచినప్పుడే దానికి విలువపోయిందన్నారు. భారత దేశం మొత్తంలో చంద్రబాబు మినహా తప్ప మరెవ్వరూ ఇంత అసహ్యకరమైన రాజకీయాలు చేయరని, రాజకీయాల్లో ఏ సిద్ధాంతాలూ, వావి వరసలు లేని రాజకీయాలు చేసేది ఆయనొక్కరేనని పేర్ని మండిపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్