Saturday, January 18, 2025
HomeTrending Newsకొంచెం చిలిపి-మరికొంత సీరియస్: బాబుతో బాలయ్య 'అన్ స్టాపబుల్'

కొంచెం చిలిపి-మరికొంత సీరియస్: బాబుతో బాలయ్య ‘అన్ స్టాపబుల్’

నందమూరి బాలకృష్ణ  వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటిటి మాధ్యమం ‘ఆహా’ లో ప్రసారమవుతోన్న ‘అన్ స్టాపబుల్‘ రెండవ సీజన్ తొలి ఎపిసోడ్ గెస్ట్ ఎవరో తెలిసిపోయింది. బాలయ్య వియ్యంకుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ షో కు హాజరై సినీ, రాజకీయ విశేషాలు, నాటి పరిస్థితులు, తీసుకున్న నిర్ణయాల వెనక దాగిన అసలు నిజాలను వెల్లడించారు. ఈ ప్రోమో నేడు  విడుదలైంది.

“సదా నన్ను కోరుకొనే మీ అభిమానం… ‘అన్ స్టాపబుల్’ను టాక్ షోలకి అమ్మమొగుడిగా చేసింది…” అంటూ బాలయ్య డైలాగ్ మొదలు పెట్టారు. ” మొదటి ఎపిసోడ్ గా మా బంధువును ముందుగా పిలుద్దామనుకున్నా… కానీ, ప్రజలందరి బంధువును పిలిస్తే బాగుంటుందనుకున్నా… అందుకే మీకు బాబుగారు… నాకు బావగారూ…” అంటూ చంద్రబాబు నాయుడుకు బాలయ్య స్వాగతం పలికారు.

“నాకు రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి…” అంటూ బాలయ్య చెప్పడం, “అయితే వసుంధరకు కూడా చెబుదాం… బ్రేకింగ్ న్యూస్ ఇది…” అంటూ చంద్రబాబు ఫోన్ తీయడం ఆకట్టుకుంది.  “మీరు చేసిన మోస్ట్ రొమాంటిక్ పని ఏంటి…” అని బాలయ్య అడగ్గా… “మీ కంటే ఎక్కువ చేశా…” అంటూ జవాబిచ్చారు.  “మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?” అన్న ప్రశ్నకు చంద్రబాబు “రాజశేఖర్ రెడ్డి…” అని చెప్పడమూ ఆకట్టుకుంది. 1995లో అందరూ కలసి తీసుకున్న ‘బిగ్ డెసిషన్’ గురించి కూడా చర్చకు వచ్చింది. ఈ షో మధ్యలో చంద్రబాబు తనయుడు, బాలయ్య పెద్దల్లుడు లోకేశ్ కూడా పాల్గొనడం మరింతగా ఆకట్టుకుంది. లోకేశ్ ను మంగళగిరి ఎన్నికల ఫలితం గురించి అడగడమూ ఆసక్తి కలిగించింది. తరువాత బాలయ్య సీట్ లోకి లోకేశ్ మారి ప్రశ్నలు కురిపించడమూ మురిపించింది. ఇందులో కేవలం రాజకీయాలే కాకుండా, నందమూరి- నారావారి కుటుంబాల అనుబంధాన్నీ ముచ్చటించుకోవడం అభిమానులను తప్పకుండా అలరిస్తుంది. ఈ నెల 14న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

Also Read: అన్ స్టాప‌బుల్ సాంగ్ తో అద‌ర‌గొట్టిన బాల‌య్య‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్