Sunday, January 19, 2025
HomeTrending Newsచంద్రబాబు పతనం "అన్ స్టాపబుల్"..అంబటి విమర్శ

చంద్రబాబు పతనం “అన్ స్టాపబుల్”..అంబటి విమర్శ

వైఎస్ఆర్ కు  స్నేహితుడు అని చెబుతున్న చంద్రబాబు.. వైఎస్ దగ్గర పాకెట్ మనీ తీసుకున్నానని చెప్పలేదేమిటని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు  ప్రశ్నించారు. లోకేష్ ఒక బఫూన్.. బాలకృష్ణ అమాయకుడు, అసమర్థుడు అన్నారు. తాడేపల్లి – వైఎస్‌ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన మంత్రి… చంద్రబాబు తీరుపై ఘాటుగా విమర్శలు చేశారు.

మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…

బాలకృష్ణ సమర్థుడు అయితే బాబుకు తమ్ముడి గతే.. ఆహా అనే టీవీ సంస్థ బాలకృష్ణ హోస్ట్‌గా నిర్వహరిస్తున్న అన్‌ స్టాపబుల్‌ కార్యక్రమానికి గతంలో చాలామంది ప్రముఖులు హాజరు అయ్యారు. వాళ్లంతా కూడా ముఖ్యంగా సినిమా రంగంలో ప్రముఖులు. ఆ షో ప్రజలకు వినోదాన్ని కలగించేలా పాపులర్‌ అయింది. దానికి నిన్న మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పుత్ర సమేతంగా ఆ టాక్‌ షోలో పాల్గొన్నారు. అయితే ఆ టాక్‌ షో ఆద్యంతాన్ని పరిశీలించిన తర్వాత దానిలో వారు మాట్లాడిన మాటలు, వారు ప్రదర్శించిన డ్రామాలు, వారి అబద్ధాలు చూశాక.. దానిమీద స్పందించాలనిపించింది. అందుకే మీడియా ముందుకు రావడం జరిగింది.
– టాక్‌ షోను నిర్వహించేది బాలకృష్ణ. బాలయ్యకు చంద్రబాబు బావ అవుతారు, లోకేష్‌ అల్లుడు అవుతాడు. వీళ్లంతా కూర్చుని ఒక షో నడిపారు. దీనిలో విచిత్రమైన అంశం ఏంటంటే.. లోకేష్‌ అనే వ్యక్తి ఒక హాస్యనటుడిలా ఉన్నాడు. సినిమాలు, రాజకీయాలు, నిత్య జీవితంలో కూడా కొంతమంది హాస్యాన్ని పోషించేవాళ్లు ఉంటారు. అలాంటి బఫూన్‌ క్యారెక్టరే లోకేష్‌ది. ఇక నందమూరి బాలకృష్ణగారిని బఫూన్‌, జోకర్‌ అనలేను కానీ, అమాయకుడు, అసమర్థుడు కూడా. అందుకే ఆయన ఆ స్థాయిలో ఉంటే … చంద్రబాబు 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ స్థాయిలో ఉన్నాడు.
– బాలకృష్ణ సమర్థుడు అయితే చంద్రబాబు తన తమ్ముడు స్థాయిలో ఉండేవాడు. అర్హతలు ఏమీ లేకపోయినా కుట్రలు, కుతంత్రాలు, మోసం, దగా రాజకీయాలతో అందలం ఎక్కిన వ్యక్తి చంద్రబాబు నాయుడు.

బాబు వెన్నుపోటు మరకను చెరిపివేసేందుకే..
మొత్తం టాక్‌ షో చూస్తే బాలకృష్ణ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు చూస్తే ప్రధానంగా ఒకటనిపిస్తుంది. 27 సంవత్సరాల క్రితం జరిగిన వెన్నుపోటు రక్తపు మరకను తుడిచేసుకునే ప్రయత్నం చేశాడు చంద్రబాబు. బామ్మర్ది, బావ కలిసికట్టుగా రక్తపు మరకను తుడిచేసుకునేలా చేసిన ప్రయత్నం చాలా బాధ కలిగించింది. పోగాలం దాపురిస్తే ఇలాంటి ఆలోచనలు, ప్రయత్నాలే చేస్తారు. ఇంతకు ముందు రాజకీయ నాయకులు ఎవరూ హాజరు కానీ ఈ షోకు చంద్రబాబు ఎందుకు హాజరయ్యారు?. బాలయ్యను సపోర్ట్‌ చేయడానికా? ఆ షో రేటింగ్‌ పెంచడానికి హాజరు అయ్యారా? లేక తన స్వార్థం కోసం చంద్రబాబు హాజరయ్యారా?. తన స్వార్థం లేనిదే చంద్రబాబు నాయుడు ఏ పనీ చేయరనేది అందరికీ తెలుసు. పతనం అవుతున్న తన రాజకీయ జీవితానికి ఏకాస్త అయినా ఉపయోగపడుతుందనే ఆశతో హాజరై పప్పులో కాలువేసి ఆ రెండు కుటుంబాలు మరింత దిగజారిపోయాయి.
– ఉదాహరణకు… పోగాలం దాపురించే, అమరావతి నుంచి అరసవెల్లికి మహా పాదయాత్ర అంటూ రైతుల ముసుగులో టీడీపీ తీసుకున్న నిర్ణయం. ఇవాళ ఏం జరుగుతోంది? మహా పాదయాత్ర పేరుతో వెళుతున్న ఫాల్స్‌ పాదయాత్రను చూసి ఉత్తరాంధ్ర ప్రజలు చైతన్యం అవుతున్నారు. వారు పిడికిలి బిగించి ఉద్యమం చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల చంద్రబాబుకు వ్యతిరేకంగా మూడు ప్రాంతాల్లో ప్రజలు చైతన్యవంతులయ్యారు. రాజకీయంగా రోజురోజుకీ దిగజారిపోతున్నచంద్రబాబు, మరింత పతనం అవడానికి తీసుకున్న నిర్ణయమే ఇది.

షో హిట్.. “నారా-నందమూరి” పరువు ఫట్
ఎన్టీఆర్‌ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం కోసమే తీసుకున్న నిర్ణయమంటూ చంద్రబాబు- బాలకృష్ణలు చెబితే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పెద్ద అక్షరాలతో రాశాయి. చంద్రబాబు చెబుతారు… బాలయ్య అవును అవును బావగారూ.. తానా తందానా అంటాడు. ఎన్టీఆర్‌ కాళ్లు పట్టుకుని మూడు గంటలు సేపు బతిమిలాడినా వినలేదు అని, అందుకే జుట్టుపట్టుకుని కిందకు లాగేశానని చంద్రబాబు మాట్లాడితే అది ధర్మమే, న్యాయమే అని బాలకృష్ణ సపోర్టు చేస్తున్నారు. ఇదేమీ అన్యాయం…?. ఇది పోగాలం కాదా..?.
– 1983లో ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ పెట్టుకుని కష్టపడి అధికారంలోకి వచ్చారు. ఇంటింటికి తిరిగి పార్టీని పటిష్టం చేసుకుంటే, ఆయన ఆశయ సాధన కోసం పదవి నుంచి దించేసి, ఎన్టీఆర్‌ మరణానికి కారణమై… పైగా, ఇది కరెక్టేకదా అని బాబు అడగటం దానికి బాలకృష్ణ కరెక్టే బావగారు అని చెబుతున్నాడు. ఏమిటీ దౌర్బాగ్యం.?
– ఎన్టీఆర్‌ ఆశయాలను తీర్చేందుకు గద్దెనెక్కానని చెబుతున్న చంద్రబాబు నాయుడు… అసలు ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు ఎక్కడ ఉన్నాడు? . మీరు కాంగ్రెస్‌లో ఉన్నారు కదా? అధిష్టానం ఆదేశిస్తే మామ మీద పోటీ చేస్తా అని ప్రగల్భాలు పలికిన నువ్వు ఎన్టీఆర్‌ను దించేయడం ధర్మమనే మాట మాట్లాడుతుంటే.. దానికి, మీ బామ్మార్ది తానా తందానా అంటుంటే ప్రజలు నమ్మాల్సిన పరిస్థితి వచ్చిందా.. అని సూటిగా అడుగుతున్నాను.
– ఈ సందర్భంగా ఆహా టీవీ వాళ్లను కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే, 27 సంవత్సరాల క్రితం జరిగిన వెన్నుపోటుపై చర్చ జరగడం ద్వారా వెన్నుపోటు ఎలా జరిగింది? చంద్రబాబు నాయుడు ఎంత క్రూరంగా ప్రవర్తించాడనేది అర్థమయ్యేలా చర్చ జరిగింది. ఎన్టీఆర్‌ మీద వైస్రాయ్‌ హోటల్‌ దగ్గర చెప్పులు వేయడం కరెక్ట్‌ అని చెబుతున్నారా? ఎన్టీఆర్‌ను పక్కకు నెట్టేసి పార్టీని లాగేసుకుని, సైకిల్‌ గుర్తును తీసేసుకుని.. ఆయన మరణానికి కారణం అవడం కరెక్ట్‌ అనుకుంటున్నారా? మీరు చెబుతుంటే జనం నమ్మాలా?. దీనిని ఈనాడు, ఆంధ్రజ్యోతి అద్భుతం, అమోఘం, లోక కల్యాణం కోసమే ఎన్టీఆర్‌ను దించేశారని రాతలు రాస్తున్నారు. ఎన్టీఆర్‌ గారితో 1993లో లక్ష్మీపార్వతిగారికి వివాహం జరిగింది. ఆ తర్వాత జరిగిన 1994 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ 226 సీట్లు గెలిచారు. అప్పుడు మేము కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నాం. ఎన్టీఆర్‌ రెండో వివాహం చేసుకోవడం తప్పని మేము చెప్పినా… ప్రజలు యాక్సెప్ట్‌ చేశారు. లక్ష్మీపార్వతితో పెళ్లి అయినా కూడా ప్రజలు కనివినీ ఎరుగని రీతిలో భారీ మెజార్టీతో గెలిపించారు. భార్య చనిపోతే అనాథగా బతకలేకే లక్ష్మీపార్వతిని చేరదీశారు. దానిని ప్రజలు కూడా ఆమోదించారు కదా. ఇంతమంది సంతానం ఉన్నా ఎన్టీఆర్‌గారి గురించి పట్టించుకున్నారా?. లక్ష్మీపార్వతిమీద కోపం ఉంటే ఎన్టీఆర్‌ను గద్దెదించి, వెన్నుపోటు పొడుస్తారా?.
– కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గోటి కాడ నక్కలాగా కాపలా కాస్తూ వచ్చాడు. అవకాశం దొరికిన తర్వాత ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, లక్ష్మీపార్వతిని బూచిగా చూపించి కుటుంబాన్ని ఏకం చేసి, చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హరికృష్ణను ఆదరించిన అందర్నీ సంహరించాడు. చివరకు బాలయ్యను చేరదీశాడు. ఆయన కూతుర్ని కోడలుగా చేసుకుని బంధుత్వం కలిపాడు. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు చేసిన వ్యక్తి చంద్రబాబు.
– ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే … నాన్నగారికి వెన్నుపోటు పొడిచి అధికారంలో నుంచి దించేసిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఘన విజయం సాధించామని… అందుకే అది కరెక్ట్‌ అని తేలిపోయిందంటూ బాలకృష్ణ చెబుతున్నారు. మరి, 1995లో ఎన్టీఆర్‌ను అధికారంలో నుంచి దించేసి మీరు పాలన చేపట్టారు. నాలుగు నెలలకే ఎన్టీఆర్‌ చనిపోయారు. ఎన్టీఆర్‌ చనిపోకపోయి ఉంటే మీ గతి ఏమయ్యేదని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడి వెన్నుపోటు మరకను తుడిచేసుకునేలా ‘ఆహా, ఓహో’ అనే కార్యక్రమాలు చేస్తున్నారు.

వైఎస్ఆర్ గారి దగ్గర పాకెట్ మనీ తీసుకున్నది మరిచావా బాబూ..?
చంద్రబాబుకు మంచి మిత్రుడు ఎవరంటే రాజశేఖర్‌రెడ్డిగారు అన్నారు. అక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్లలేదు. వైయస్సార్‌ గారు, నేను బాగా తిరిగామని చంద్రబాబు చెబుతున్నాడు. రాజశేఖర్‌ రెడ్డిగారి వెంట తిరిగినటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు. ఎందుకు తిరిగాడో తెలుసా మీకు? ఆ రోజుల్లో వైయస్సార్‌ గారు బాగా ధనవంతుడు. ఆయనకు బెంగళూరులో డొనేషన్‌ కట్టి ఎంబీబీఎస్‌ చదివించిన కుటుంబం. చంద్రబాబుది చిన్న కుటుంబం. వారి ఫ్రెండ్షిప్‌లో రాజశేఖర్‌ రెడ్డిగారి వద్ద ఖర్చుల కోసం అయిదు, పదివేలు తీసుకునేవాడు. స్నేహితంలో డబ్బులు తీసుకోవడంలో తప్పేమీ లేదు. అయితే ఆ విషయాన్ని కూడా చంద్రబాబు చె​ప్పాలి కదా?. అది చెప్పకుండా మభ్యపెట్టే ప్రయత్నం చేశారు.
– బాలకృష్ణ, చంద్రబాబు మాట్లాడుకున్న తీరు చూస్తుంటే.. వైయస్సార్‌ గారు ఎప్పుడూ ఒక కథ చెప్పేవారు.. అదేంటంటే…
– ‘కోర్టులో ఓ వ్యక్తిని బోనులో నిలబెట్టారట. ఆయన విలవిలమని ఏడుస్తున్నాడట. కన్నీళ్లు కారుస్తూ బాధపడుతున్నాడట. జడ్జిగారు అతడిని చూసి చాలా అమాకమంగా ఉన్నాడు. ఏంటీ అతని బాధ అని అడిగారట. జడ్జిగారూ.. తల్లిదండ్రులు లేనివాడిని, క్షమించి వదిలేయాలని కోరాడట. అయ్యో తల్లిదండ్రులు లేనివాడిని ఎందుకు తీసుకువచ్చారని జడ్జి గారు అడిగితే.. అప్పుడు ప్రభుత్వ న్యాయవాది … ఆ తల్లిదండ్రులను చంపింది ఈ వ్యక్తేనని చెప్పారట. అందుకే మీముందు హాజరు పరిచామని చెప్పారట.’ ఆహా.. ఓహో కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ తంతు అలానే ఉంది. ఎన్టీఆర్ చావుకు కారణమైనవాళ్ళు.. ఆయన ఆశయాలు సాధించటానికే ఆయన పదవి లాక్కున్నామని, ఆయన మరణానికి కారణమయ్యామని చెబుతారా..?. ఇంతటి కుట్ర రాజకీయాలను ప్రజలు గమనించాలని మనవి చేస్తున్నా.

బాబే రియల్ విలన్.. లోకేష్ ఒక బఫూన్..
ఇక బఫూన్‌ లోకేష్‌ బాబును ప్రవేశపెట్టారు. అయ్యా.. మంగళగిరిలో ఓడిపోయావు కదా? ఏమిటంటే… మళ్లీ అక్కడ నుంచే పోటీ చేసి గెలుస్తానని చెప్పగానే ఆహా.. ఓహో అంటూ అల్లుడికి మామగారు గిఫ్ట్‌ హ్యాంపర్‌ ఇచ్చారు. ఆ పక్కనే కూర్చున్న లోకేష్ నాన్నగారు, మీ బావగారు చంద్రగిరిలో ఓడిపోయి కుప్పం పారిపోయారు కదా? దాని సంగతేంటి? అని ఎందుకు అడగలేదు బాలకృష్ణా..?. ఇలాంటి గొప్ప కామెడీ షోలు నడిపే ప్రయత్నం చేస్తున్నారు.
– విదేశాల్లో విచ్చలవిడిగా అమ్మాయిలతో కులుకుతున్న కొన్ని ఫోటోలు చూపించి ఏమంటావు అల్లుడు అంటే… ఇది మామ్మూలే బ్రాహ్మణి కూడా చూసింది, ఇబ్బందేమీ లేదని లోకేష్ అంటున్నాడు. అల్లుడు మీద వచ్చిన ఆరోపణలను చిన్నవి చేసుకోవడానికి ఆ టాక్‌ షోను వాడుకున్నారు. ప్రజలు అమాయకులు కాదే? . టాక్‌ షో సక్సెస్‌ కావడంలో ఎలాంటి అనుమానం లేదు. ముందే ముగ్గురూ కూడబలుక్కుని ప్రశ్నలు అడగటం… సమధానాలు చెప్పడం చూస్తే అదంతా డ్రామాలా ఎవరికైనా అనిపిస్తుంది. వాస్తవానికి, ఈ షోకు లక్ష్మీపార్వతిగారిని కూడా పిలిస్తే బాగుండేది. ఆమెను ఓ పక్కన, మరోవైపు నాదెండ్ల భాస్కరరావును కూర్చోపెట్టి షో చేస్తే ప్రజలకు, నేటి తరం యువకులకు వాస్తవాలు తెలిసేవి. ఎన్టీఆర్‌, చంద్రబాబు గురించి తెలిసిన ప్రత్యక్ష సాక్షులు వీళ్లిద్దరే. వాళ్లను పక్కన కూర్చోబెట్టినట్టైతే చంద్రబాబు బండారం బయటపడేది. ఈ షోలో రాజకీయాలు చొప్పించి, తనపై వచ్చిన ఆరోపణల నుంచి తప్పించుకోవాలనుకోవడం ఒక దిగజారుడు రాజకీయం. “కాళ్లు పట్టుకుని మూడు గంటలు బతిమిలాడడట. వినకపోవడంతో చంపేశాడట” అలాంటి చంద్రబాబును ఏమంటారు హీరో అంటారా? విలన్‌ అంటారా?
– ఫస్ట్‌ టైమ్‌ రియల్‌ విలన్‌ బాలకృష్ణ షోకు వచ్చాడు. చంద్రబాబే రియల్ విలన్ అని ప్రజలు నిర్ణయించుకుంటారు. ఎన్టీఆర్‌ను గద్దె దించడం, ఆయనకు వెన్నుపోటు పొడవడం తప్పులేదని చెబుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతిలు కూడా ముద్దాయిలే.

చంద్రబాబు పతనం అన్ స్టాపబుల్
పతనం అయిపోతున్న చంద్రబాబు నాయుడును, తెలుగుదేశం పార్టీని, లోకేష్‌ను ఈ షోలు కాపాడలేవు. చంద్రబాబు, లోకేష్‌, తెలుగుదేశం పతనం అన్‌స్టాపబుల్‌. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175 సీట్లు అన్‌స్టాపబుల్‌ అని రాసుకోమని ఈనాడు, ఆంధ్రజ్యోతికి, ఆ షోను నడిపిన బాలకృష్ణకు, ఆయన బావ చంద్రబాబుకు చెబుతున్నాను. మీరు ఎన్ని షోలు చేసినా, కుట్రలు, కుతంత్రాలు చేసినా, ఎన్నిరాతలు రాసినా 27 ఏళ్ళ క్రితం జరిగిన ఈ వెన్నుపోటు చరిత్రను ఎవరూ మార్చలేరు. బాబు వెన్నుపోటు గురించి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. వచ్చే ఎన్నికల్లో జగన్‌ మోహన్‌ రెడ్డిగారు 175 సీట్లతో అన్‌స్టాపబుల్‌గా ముందుకు వెళ్లబోతున్నారు. మీవి షోలు మాత్రమే. మాది నిజ జీవితంలో జరిగే విషయం.

ఉత్తరాంధ్రపై టీడీపీ, జనసేన దాడే ఇది
– మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ…
మూడు రాజధానులకు వ్యతిరేకంగా విద్వేషాలను రెచ్చగొట్టేది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ లే. విశాఖ గర్జన జరుగుతుంటే.. పవన్‌ కల్యాణ్ విశాఖ పర్యటనకు వెళ్లారు. అమరావతికి మద్దతుగా టీడీపీ రౌండ్‌టేబుల్‌ సమావేశం పెట్టింది. ఇవి ఏం పనులని సూటిగా అడుగుతున్నాం. ఓవైపు టీడీపీ, పవన్‌ కల్యాణ్‌ ఏం చేస్తున్నారో ఆలోచించుకోవాలి. మూడు రాజధానులు, అమరావతి గురించి పవన్‌ కల్యాణ్ గతంలో ఏంమాట్లాడాడో మర్చిపోయారా?. ఇవాళ పవన్ కల్యాణ్… వాణి – గీణి అంటూ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.
– ఉత్తరాంధ్రపైన, విశాఖపట్నంపైన దాడి చేసేలా వీళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. ఈ దాడిని విశాఖ, ఉత్తరాంధ్ర ప్రజలు తిప్పికొడతారు. ఉత్తరాంధ్ర ప్రజల పోరాటం.. చరిత్రలో నిలిచిపోయే పోరాటంగా నిలిచిపోతుంది. రైతుల ముసుగులో చేస్తున్న యాత్రను.. ఉత్తరాంధ్ర ప్రజలు తమపై దండయాత్రగానే చూస్తున్నారు. దేవుడ్ని దర్శించుకునేందుకు వచ్చేవారు ప్రజలను రెచ్చగొట్టరు, తొడలు కొట్టేవారిని, మీసాలు తిప్పేవారిని ఏమంటారు, వీరిని ఆ ప్రాంత ప్రజలు క్షమించరు. విశాఖ, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు చైతన్యవంతం అవుతారు. వాళ్లకి సరైన గుణపాఠం చెబుతారు.
– జోరు వర్షంలోనూ, ఇవాళ విశాఖలో అద్భుతమైన ర్యాలీ- విశాఖ గర్జన జరిగాయి. ఉత్తరాంధ్ర ప్రలజంతా కలిసికట్టుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఉత్తరాంధ్రపై దాడి చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ తగిన మూల్యం చెల్లించుకుంటారు.
– అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు.. చివరకు టాక్ షో కు వెళ్లి కూర్చున్నాడు. ఇంతకన్నా దిగజారుడు ఇంకేమి ఉంటుంది. కేంద్రంలో చక్రం తిప్పాననే పెద్దమనిషి బావురుమని ఏడుస్తూ అసెంబ్లీ నుంచి వెళ్లి బామ్మార్ది దగ్గర షోలు చేసుకునే స్థితికి చంద్రబాబు దిగజారిపోయాడు. ఇంకా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉంది.?
– అన్‌ స్టాపబుల్‌ లేదు… ఏ స్టాపబుల్‌ లేదు. తెలుగుదేశం ఈజ్‌ ఏ అవుట్‌ బాల్‌ అని అందరికీ అర్థం అయిన తర్వాతే చంద్రబాబుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. టాక్‌ షోను పట్టుకుని ఎదగాలని చంద్రబాబు ప్రయత్నాలు చేయడం చాలా దురదృష్టకరం.
– 27 ఏళ్ల క్రితం జరిగిన వెన్నుపోటు ఎసిసోడ్‌ లో బాబు బండారం ఏమిటో.. ఈ టాక్‌ షో ద్వారా మరోసారి బయటపడింది… అని మంత్రి అంబటి రాంబాబు వివరించారు.

Also Read : ఇప్పుడే ఏమీ చెప్పలేను: చంద్రబాబు

RELATED ARTICLES

Most Popular

న్యూస్