Saturday, January 18, 2025
HomeTrending Newsవిఎకె వారి ముచ్చట

విఎకె వారి ముచ్చట

Vak Ranga Rao : మా నాన్నగారి మిత్రబృందం అనంతం. అందులో రచయితలు, విమర్శకులెందరో ఉన్నారు. ఆయన తెలుగు, సంస్కృత భాషా బోధకులుగా మద్రాసులో పని చేయడంవల్ల శిష్యుల జాబితా సముద్రమంత. అయితే వారిలో నాకు తెలిసింది బహు తక్కువ. వారిని పలకరించినప్పుడు మా నాన్నగారిని ప్రత్యక్షంగా చూసినంత ఆనందానుభూతి కలుగుతుంది. వారిలో ఒకరైన వి. ఎ. కె. రంగారావు గారితో ఛాట్ చేసినప్పుడో ఉత్తరాలు రాసుకున్నప్పుడో కలిగే ఆనందం మాటలకతీతం.

నిన్నొక పుస్తకం కోసం వెతుకుతుంటే అది దొరకలేదు కానీ ఓ ఉత్తరం బయటపడింది. ఆ ఉత్తరానికి ఇవాళ్టికి అయిదేళ్ళు. అది తీసి మరొక్కసారి చదివాను. రంగారావుగారు నాకు రాసిన ఉత్తరమే. విషయమంతా మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి గొప్పతనం గురించే. మల్లాదివారిల్లు మా ఇంటికి దగ్గర్లో త్రిమూర్తి స్ట్రీట్లో ఉండేది.మేము తిలక్ స్ట్రీట్లో ఉండేవాళ్ళం. మల్లాదివారిని రంగారావుగారు తమ గురువుగా భావిస్తారు. ఆ ఉత్తరంలోని ప్రతి మాటా అక్షర సత్యం.

ఆ లేఖలోని మాటల్ని యథాతథంగా ఇక్కడ సమర్పించాను….

రాత్రి ఎనిమిది,

జూలై 25, 2018, మద్రాసు.

ప్రియమైన చిరంజీవి జగదీశ్ కి,

నలుగురు చెప్పుకోవడం వలన యామిజాల (పద్మనాభస్వామి) వారికి సంస్కృతం కరతలామలకం అని నాకు తెలుసు. ఆరుద్ర గారొకనాడు నాతో చెప్పారు.

నేను మాత్రమే కాదు, యామిజాలంతటి వాడు కూడా ఏదైనా బోధపడకపోతే మల్లాది వారినడుగుతాడు. వారికి గుర్తు వుంటే వెంటనే చెప్పేస్తారు. లేకపోతే ఫలానా లైబ్రరీలో ఫలానా పుస్తకంలో రెండో ప్రకరణంలో వుంటుంది. వెళ్ళి చూడు అని చెప్పేవారు.

ఒకమారు నేను పద్మనాభస్వామిగారినే అడిగానీ విషయం

“వారికి గుర్తు లేక కాదు. ఆ పుస్తకం మా చేత చదివిస్తే మరికొన్ని విషయాలు మాకు తెలుస్తాయని ఆ పుస్తకాలవేపు పంపేవారు” అని వివరించారు.

వీరేకాదు, ఆనందవాణి నడిపే కాళిదాసు, వంగ నవలలు తెనిగించే ఆయనొకరు యిలా సందేహనివృత్తికై రామకృష్ణ శాస్త్రిగారి నాశ్రయించడం నేనెరుగుదును.

వీళ్ళంతా సామాన్యులు కారు. తెలియనివి తెలుసుకోవాలంటే మనం నిఘంటువులనో ఎన్ సైక్లోపీడియాలనో ఆశ్రయించడం లేదూ, అలాగే.

ప్రేమతో మద్రాసు తాతయ్య.

ఇది అందినట్లు సందేశం పంపండి.

ఈ ఉత్తరం చదివిన రంగారావుగారితో ఛాట్ చేసాను ఎస్ఎంఎస్ ల ద్వారా!

“నమస్కారాలు. ఎలా ఉన్నారు? కొన్నేళ్ళయింది పలకరించి… క్షేమమని తలుస్తాను… మల్లాది వారి పేరొక చోట చదవడంతోనే మీరు ప్రత్యక్షమయ్యారు” అని ఓ మెసేజ్ ఇవ్వగా ఆయన “అవును మరి. కృష్ణ భగవానునితోపాటు కుచేలుడు” అని జవాబిచ్చారు.

“ఇంటి అడ్రెస్ అదేనాండీ ? ఉత్తరం రాద్దామని. మీ నుంచి జవాబు పొందడం కోసం. మీ కవరూ, విషయాలూ ఓ ప్రత్యేకం” అనగా ఆయన ఇంటి అడ్రెస్ – 1ఏ, Easdale Enclave, 111/2, Sterling Road, Madras 600034 ఇస్తూ “ఐమాయ్ ఓకే. థాంక్స్. టు ఫర్గెట్ పిన్స్ అండ్ థార్న్స్. ఐ స్విమ్ ఇన్ బుక్స్ ఆఫ్ మెనీ కైండ్స్” అన్నారు.

చదువుతున్నవి మూడు. చదవాల్సినవి ఒక పది. పైగా 9 ఆంధ్ర, ఆంగ్ల పత్రికలు. నా ఆశకు అంతులేదు. ఒక పెద్ద హిందీ పుస్తకం కూడా. సినిమా సంగీత దర్శకుల గురించి, నింపాదిగా. హై స్కూలు హిందీ మరి అన్నారు.

ఆయనను అప్పుడప్పుడూ కృష్ణపరమాత్మ గురించి చిన్న చిన్న కవితలు చెప్పమని అడగటం నా అలవాటు. ఈసారీ అలాగే అడిగాను. దాని కాయన చెప్పిన మాటలు…

“ఈ చల్లని రేయి తిరిగి రానే రాదు

నీ నల్లని మోము చూడతనివి తీరదు

ఒడలు పులకరింపచేయడానికి భాష ఏదైనా ఒకటే….”

 

Vak Ranga Rao

విఎకె రంగారావు గారు సామాన్యులుకారు. ఆయన గురించి ఒకటి రెండు మాటలు…

ఆయన సుప్రసిద్ధులైన సంగీత వేత్త, కళా విమర్శకులు. తమ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేసే విఎకె గారు బొబ్బిలి జమిందారీ వంశీయులు. ఆయన స్వస్థలం చిక్కవరం. ఆయన పుట్టి పెరిగింది మద్రాస్. ఆయన పూర్తి పేరు రావు వెంకట ఆనందకుమార కృష్ణ రంగారావు. 78 rpm గ్రామ్ ఫోన్ రికార్డులు యాభై వేలకు పైగా ఉన్నాయి. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్స్ లో ఆయన పేరు ఈ గ్రాంఫోన్ రికార్డుల సేకరణతో నమోదైంది. యాభై మంది గాయనీగాయకుల తొలి రికార్డులు ఆయన దగ్గర ఉండటం విశేషం. మన భారతీయ భాషల రికార్డులతోపాటు పదిహేను విదేశ భాషలకు సంబంధించినవీ ఆయన వద్ద ఉన్నాయి.

– యామిజాల జగదీశ్

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్