సంగారెడ్డి జిల్లా జిన్నారం గడ్డపోతారం పారిశ్రామికవాడలో హెటిరో ల్యాబ్స్‌లోకి ప్రవేశించిన చిరుతను అధికారులు బంధించారు. నెహ్రూ జూపార్క్‌కు చెందిన ప్రత్యేక బృందం చిరుతకు మత్తు మందు ఇచ్చి ఆ తర్వాత బోన్‌లో బంధించి పార్క్‌కు తరలించారు. శనివారం తెల్లవారు జామున 4 గంటలకు కంపెనీకి చెందిన హెచ్ బ్లాక్‌లోకి చొరబడిది. దీన్ని గమనించిన ఉద్యోగులు గేట్లకు తాళాలు వేసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.
జిల్లా అటవీ అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ అధికారులు హెటిరో పరిశ్రమకు చేరుకొని చిరుత కోసం గాలింపు చేపట్టారు. అధికారుల ప్రయత్నాలు విఫలం కావడంతో నెహ్రూ జూపార్క్‌కు చెందిన ప్రత్యేక బృందం రంగప్రవేశం చేసింది. గన్ సహాయంతో చిరుతకు మత్తుమందు ఇచ్చారు. ఆ తర్వాత చిరుతపులి నిద్రలోకి జారుకోగానే పట్టుకొని బోన్‌లో నిర్బంధించి ఆ తర్వాత నెహ్రూ జూ పార్క్‌కు తరలించారు. ఇదిలా ఉండగా.. గత మూడు నెలలుగా చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.