ఐపీఎల్ 17 వ సీజన్ నేడు అట్టహాసంగా మొదలైంది. ఆరంభ మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై విజయం సాధించింది. చెన్నై బౌలర్ ముస్తాఫిజుర్ నాలుగు వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ అందుకున్నాడు. బ్యాట్స్ మెన్ రచిన్ రవీంద్ర కేవలం 15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ తొలి వికెట్ కు 41 పరుగులతో శుభారంభం చేసింది. 23 బంతుల్లో 8 ఫోర్లతో 35 పరుగులు చేసిన కెప్టెన్ డూప్లెసిస్ ముస్తాఫిజుర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అదే ఓవర్ చివరి బంతికి రజత్ పటీదార్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో దీపక్ చాహర్ బౌలింగ్ లో గ్లెన్ మాక్స్ వెల్ కూడా గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ 20 బంతుల్లో ఒక సిక్సర్ తో 21; కామెరూన్ గ్రీన్ 18 పరుగులు చేసి ఔటయ్యారు. దినేష్ కార్తీక్- అర్జున్ రావత్ లు ఆరో వికెట్ కు95 పరుగులు జోడించి జట్టు పరువు నిలిపారు. దినేష్ 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసి నాటౌట్ గా నిలవగా.. అర్జున రావత్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరుగులు చేసి చివరి బంతికి రనౌట్ అయ్యాడు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.
చెన్నై బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ 4, దీపక్ చాహర్ ఒక వికెట్ పడగొట్టారు.
చెన్నై తొలి వికెట్ (కెప్టెన్ రుతురాజ్-15)కు 38 పరుగులు చేసింది. రచిన్-37; అజింక్యా రెహానే-27; డెరిల్ మిచెల్-22 పరుగులు చేసి ఔటయ్యారు. శివమ్ దూబే-34 (28 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్); రవీంద్ర జడేజా-25 (17 బంతుల్లో 1 సిక్సర్) పరుగులతో నాటౌట్ గా నిలిచి 18.4 ఓవర్లలోనే విజయం అందించారు.
బెంగుళూరు బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 2; యష్ దయాళ్, కర్ణ శర్మ చెరో వికెట్ పడగొట్టారు.