Saturday, November 23, 2024
HomeTrending NewsGaddar: చైతన్యాన్ని రగిలించిన యుద్దనౌక గద్దర్ - కెసిఆర్

Gaddar: చైతన్యాన్ని రగిలించిన యుద్దనౌక గద్దర్ – కెసిఆర్

తెలంగాణ పాటకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన ప్రజా వాగ్గేయకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో తన పాటద్వారా పల్లె పల్లెనా భావజాలవ్యాప్తి చేసిన గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) మరణం గురించి తెలిసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. వారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.
తెలంగాణ కోసం తన ఆట పాటలతో ప్రజల్లో స్వరాష్ట్ర చైతన్యాన్ని రగిలించిన గదర్ ప్రజాయుద్దనౌకగా ప్రజల హృదయాల్లో నిలిచారని సిఎం తెలిపారు. ప్రజలకోసం తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేసి ప్రజలకోసమే బతికాడని, గద్దర్ మరణంతో యావత్ తెలంగాణ గొప్ప ప్రజా కవిని కోల్పోయిందని సిఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ కోసం గదర్ చేసిన సాంస్కృతిక పోరాటాన్ని, గదర్ తో తనకున్న అనుబంధాన్ని సిఎం కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
సాధారణ బుర్రకథ కళాకారుడుగా ప్రారంభమైన గదర్ కళాజీవితం, విప్లవ రాజకీయాలతో మమేకమై, అనంతర కాలంలో తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమంలో సాంస్కృతిక పోరాటంలో ఉన్నతస్థాయికి చేరిందన్నారు. కవిగా గదర్ ప్రజా కళలకు, ఉద్యమాలకు చేసిన సేవలు మరుపురానివని, వారు లేని లోటు పూడ్చలేనిదని సిఎం కేసీఆర్ అన్నారు. ప్రజా కళాకారులకు కవులకు మరణం వుండదనీ, ప్రజాకళలు వర్ధిల్లినంతకాలం ఆయన పేరు అజరామరంగా నిలిచి ఉంటుందని సిఎం తెలిపారు.
శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు సిఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్