Friday, March 29, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంరాయలసీమకు నామకరణం

రాయలసీమకు నామకరణం

Naming Ceremony: పరిపాలనా వికేంద్రీకరణపై ఏపీ అసెంబ్లీలో జరిగిన ప్రత్యేక చర్చలో పాల్గొన్న తిరుపతి వైఎస్సాఆర్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి… చిలుకూరి నారాయణరావు పేరును ప్రస్తావించారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ప్రాంతాన్ని దత్తమండలాలు, సీడెడ్‌జిల్లాలు అంటూ పిలవడాన్ని తట్టుకోలేని చిలుకూరి…నంద్యాలలో 1928లో జరిగిన దత్తమండలాల ప్రథమ మహాసభలో.. ఈ ప్రాంతానికి రాయలసీమ అని పిలవాలని ప్రతిపాదించడం..దాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించడం చరిత్ర. చిలుకూరి ప్రతిపాదనకు ఎంత గౌరవం ఉందో దీన్ని బట్టే తెలుస్తుంది.

శ్రీకాకుళం జిల్లా పొందూరుకు దగ్గర్లోని ఆనందపురంలో 1890లో పుట్టిన చిలుకూరి.. మెట్టిందీ, సాహితీపట్టం కట్టింది అంతా అనంతపురంలో. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయనను గిడుగు రామ్మూర్తిపంతులు చేరదీశారు. చదువు చెప్పారు. గురువుకి తగ్గ శిష్యుడిగానే ఉత్తరోత్తరా చారిత్రక పరిశోధనకు నడుం కట్టారు. శిలాశాసనం కనిపిస్తే చాలు కాపీలను రాసుకొని పరిష్కరించారు. కవిగా, పండితుడిగా, విమర్శకుడిగా, పరిశోధకుడిగా, సంచార గ్రంథాలయంగా పేరు తెచ్చుకొన్నారు.
నన్నయ భారతం మీద ఆయన పరిశోధనలే ఇప్పటికీ ప్రామాణికమని చెబుతారు. మూడు ఎమ్మేలు చేశారు. తెలుగులో తొలి పీహెచ్‌డీని మద్రాస్‌యూనివర్సిటీ నుంచి అందుకొన్నారు. రెండుసార్లు మహోపాధ్యాయ బిరుదాన్ని పొందిన అరుదైన గౌరవం దక్కించుకున్నవారు ఆయనలా బహుశా దేశంలో మరొకరుండరేమో! కాశీ సంస్కృత పీఠం, ఆంగ్లేయ ప్రభుత్వం ఈ గౌరవ పురస్కారాలను ఆయనకు అందించాయి.

ఆయన స్థాపించిన సంస్థలు ఆంధ్రదేశంలో ప్రత్యేక గుర్తింపు పొందాయి. రాజమండ్రిలో దేశీయ ఇతిహాస మండలి స్థాపకుల్లో ఆయన ఒకరు. ఆనాటి యువకవుల్ని ఉత్తేజితుల్ని చేసిన నవ్యవసాహిత్య పరిషత్తును గుంటూరులో ఏర్పాటు చేయడంలో ఆయన కీలక భూమిక పోషించారు. అంతేకాదు ఆపరిషత్తుకు ఆయన చాలాకాలం అధ్యక్షుడిగా ఉన్నారు. అనంతపురంలో కృష్ణదేవరాయ పీఠాన్ని నెలకొల్పారు.

దేశచరిత్రలు, జీవిత చరిత్రలు, నిఘంటువులు, పదకోశాలు ఇలా ఒకటా రెండా? ఆయన దాదాపు 250 వరకు పుస్తకాల్ని రాశారు. జైనం, బౌద్ధం, ముస్లిం, క్రిస్టియన్‌మతాలకు సంబంధించిన పుస్తకాలను ఆయన రాశారు. బైబిల్‌పాత, కొత్త నిబంధనల్ని తెలుగులోకి అనువదించారు. ఇంగ్లిష్‌లోనూ ఆయన 7 వరకు ప్రామాణిక పుస్తకాలు రాశారు. తెలుగు ప్రాకృత జన్యమంటూ చేసిన భాషావాదాన్ని ఆయన గురువులు గిడుగు సహా మారేపల్లి, కోరాడ, వజ్ఝల, గంటి లాంటివారు ఆమోదించలేదు. అయినా తన వాదనను మార్చుకోలేదు. తెలుగు భాషా చరిత్రలో సుస్థిర స్థానం పొందిన ఆ మహోపాధ్యాయుడు 62 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

-బొబ్బిలి శ్రీధరరావు

Also Read:

సీమ రక్తము కూడా ఎర్రగానే యుండును!

Also Read :

తెలంగాణ జన్మ నక్షత్రం

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్