Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Humiliating the Rayalaseema Region:
బి జె పి ఏ పి శాఖాధ్యక్షుడు సోము వీర్రాజు గారికి బహిరంగ లేఖ.
అయ్యా, నమస్తే.

రాయలసీమది కన్నీటి కథ – అంతు లేని వ్యథ .

మా బాధలో మేము పీకల్లోతు మునిగి విలవిలలాడుతుంటే ఒక్కసారిగా మీ కన్ను మా మీద పడడంతో పుండుమీద కారం చల్లినట్లుంది పరిస్థితి . ఒక్కో భౌగోళిక ప్రాంతానికి ఒక్కో చరిత్ర, సంస్కృతి, మాండలికం , ఆచార వ్యవహారాలు విధిగా ఉంటాయి. నెలకు ముమ్మారు వర్షాలు కురిసిన రాయల కాలంలో రాయలసీమ ఎలా ఉండేదో? అంతటి మహోజ్వల వైభవ దీప్తులు నేడు కనీసం ఇంగువ కట్టిన గుడ్డగా అయినా ఎందుకు మిగలలేదో మేము విడిగా చెప్పాల్సిన పనిలేదు.

వరుస కరువులు, జలవనరుల కొరత, జలదోపిడీ, పాలకుల పక్షపాతం, మా నిర్లక్ష్యమే సీమ దుస్థితికి కారణం.

నెలకు అయిదారువేల జీతానికి సీమ కన్నడ నేలకు, కేరళకు వలసపోతోంది. మండు వేసవిలో బిందె నీళ్లు రెండు రూపాయలనుండి అయిదు రూపాయలవరకు పెట్టి కొనలేక సీమ గొంతు తడారిపోతోంది. వేసిన వేరు సెనగ విత్తనం ఒక్క వర్షమయినా లేక చెద పురుగుల పాలవుతోంది. 60 ఏళ్ల కిందట పెన్నేటి పాటలో విద్వాన్ విశ్వమ్ చెప్పినా, ఆ తరువాత ఎడారి కోయిలలో మధురాంతకం రాజారామ్ చెప్పినా, నిన్న మొన్న పాలగుమ్మి సాయినాథ్ చెప్పినా సీమలో మార్పు లేదు- సీమకు ఓదార్పు లేదు.

Rayalaseema Culture

ఇలా-
సవాలక్ష సమస్యలతో మేము సతమతమవుతుంటే మీరు మాత్రం మమ్మల్ను విలన్లను చేసి, మా చేతిలో కత్తులు, గొడ్డళ్లు, బాంబులు పెట్టి – మమ్మల్ను నరరూప రాక్షసులుగా చిత్రీకరించి అవమానిస్తున్నారు. సీమ యాస ఒక ఎగతాళి. సీమ సంస్కృతి ఒక బీభత్స భయానకం. సీమ పల్లె ఒక విధ్వంసం. సీమలో పంచె కట్టిన ప్రతివాడు వేటుకొక గొంతు కోసే పగవాడు. సీమ నెత్తురు పెల్లుబికే లావా. సీమ పగ వంశపారంపర్యం. సీమలో బాంబులు కుటీర పరిశ్రమ- వేటకొడవళ్లు మధ్య తరహా పరిశ్రమ – కిడ్నాపులు హత్యలు భారీ పరిశ్రమ. ఉదయాన్నే కాఫీ టీ లకు బదులు గ్లాసుల్లో అప్పుడే చంపిన మనుషుల రక్తం తాగుతారు-
ఇదీ మీ అవగాహన. బయటి ప్రాంతాలవారికి సీమ గురించి మీరు ఏర్పరిచిన అభిప్రాయం. ఒక ప్రాంతాన్ని గంపగుత్తగా విలన్ గా ముద్ర వేయడం ఏ రకం రాజకీయం?
భాషా సాహిత్యాలు; కళా సాంస్కృతిక రంగాలు; విద్యా వైజ్ఞానిక, వాణిజ్య , రాజకీయ, ఇతర రంగాల్లో రాయలసీమ చరిత్ర సేవలు రాస్తే రామాయణం, చెబితే భారతం. మీరు మా గొప్పను నెత్తిన పెట్టుకోండని అడగడం లేదు . మా కష్టాలకు కన్నీరు కార్చమని ప్రాధేయపడడం లేదు. అసలే దగా పడ్డ , శోక తప్త సీమను మీ రాజకీయ వినోదంతో ఇంకా ఎందుకు గుచ్చి గుచ్చి చంపుతారు ?

ప్రజాస్వామిక భూమికమీద ఉన్నాం. జనబాహుళ్య మాధ్యమాల్లో మీరు మా మీద వేసిన హంతక ముద్రలు కడప విమానాశ్రయం రన్ వే దాటి ఖండాంతరాల్లో కూడా గుచ్చుకుంటున్నాయి. రాయలసీమను ఘోరంగా అవమానిస్తుంటే అందరూ చోద్యం చూస్తున్నారు . ఒకరి కన్నీళ్లు మరొకరికి వినోదం కావడం మానవ నాగరికతకే మాయని మచ్చ.

రెండున్నర గంటల సినిమాల్లో రెండు గంటలా ఇరవై అయిదు నిముషాలు సీమ గుండెను వేట కొడవళ్ళతో నరికి నరికి, చివరి అయిదు నిముషాలు శాంతి మంత్రం జపిస్తే సీమ గుండె గాయం మానుతుందా? ఆగిన గుండె మళ్ళీ కొట్టుకుంటుందా?
మా సహనానికి కూడా హద్దు ఉంటుంది. రాయలసీమ సంస్కృతి , భాష , ఆచార వ్యవహారాలను ఎగతాళి చేసే, కించపరిచేవారిని అడ్డుకోవాల్సిందిగా మేము అడుక్కోవాలా?

మీడియా, సినిమా, రాజకీయ రంగాలు పదే పదే రాయలసీమ ఆత్మాభిమానాన్ని, మనసులను, సంస్కృతిని కించపరుస్తున్నాయి. గాయపరుస్తున్నాయి.

మీ పశ్చాత్తాపాలు, ప్రాయశ్చిత్తాలు, క్షమాపణలను మా గుండెలేని బండబారిన హంతక హృదయాలు తట్టుకోలేవు సార్. రక్తం రుచి మరిగిన నరరూప రాక్షసులమయిన మా నుండి సంస్కారాలు ఆశించకండి సార్.

పొడవండి సార్.
ఇంకా లోతుగా పొడవండి.
మా గుండెకు గునపం గుచ్చుకునే దాకా పొడుస్తూనే ఉండండి.

కస కస కొయ్యండి సార్.
మా వ్యక్తిత్వంలో చివరి రక్తపుబొట్టు కూడా గడ్డ కట్టేంత దాకా కోస్తూనే ఉండండి.

మా సంస్కృతిని నీచంగా చిత్రీకరించే సినిమాలకోసం మా వేళ్లను మేమే కోసుకుని రక్త తిలకాలు దిద్ది, పాలాభిషేకాలు చేసి పొంగిపోయే అంతులేని ఔదార్యం మాది. మీరెందుకు తొందరపడి క్షమాపణలు చెప్పడం?
మీరు వయసులో, అనుభవంలో పెద్దవారు. పది కాలాలు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి.
మీ పార్టీ చాలా పెద్ద పార్టీ. పది కాలాలు పచ్చగా ఉండాలి.

విమానం పోతే పోనీ…
మా మానాన్నయినా కాపాడండి చాలు.
విమానం జోలికి రాకుండా…మా మానాన మేముంటాం.
సబ్ కా సాత్ మాటలు పడుతూ అబ్ కా విషాద్ లో ఉండలేము వీర్రాజు గారండీ! ఆయ్!!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

సోములోరి సిద్ధాంతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com