Friday, October 18, 2024
HomeTrending Newsబ్రహ్మపుత్ర నదిపై చైనా కుట్ర

బ్రహ్మపుత్ర నదిపై చైనా కుట్ర

China conspiracy on the Brahmaputra river

భారత్ ను ఇబ్బంది పెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాల్ని చైనా ఆచరణలోకి తీసుకొస్తోంది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల వరకు బులెట్ రైలు ప్రారంభించిన చైనా ఇప్పుడు బ్రహ్మపుత్ర నదిపై విద్యుత్ ప్రాజెక్ట్ ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బ్రహ్మపుత్ర నదిని టిబెట్ లో యార్లూంగ్ సాంగ్పో పేరుతో అరుణాచల్ ప్రదేశ్ లో సియాంగ్ , దిహాంగ్ పేర్లతో పిలుస్తారు. బంగ్లాదేశ్ లో జమున నదిగా వాడుకలో ఉంది.

అరుణాచల్ మీద కన్నేసిన చైనా ఆ రాష్ట్రం తనదే అని దశాబ్దాలుగా వాదిస్తోంది. ఈ వ్యవహారంలో  భారత్ నుంచి ఊహించని స్థాయిలో వ్యతిరేకత రావటంతో కొత్త దారులు వెతుకుతోంది. ఈ ప్రాంతానికి ప్రాణాధారంగా ఉన్న బ్రహ్మపుత్ర నది ప్రవాహాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని చైనా కుట్రలు చేస్తోంది. చైనా విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తే దిగువన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్ మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

అరుణాచల్, అస్సాం, బంగ్లాదేశ్ లకు బ్రహ్మపుత్ర నది జీవనాధారం. దీని మీద నిర్మించిన ప్రాజెక్టుల ద్వారానే ఈశాన్య రాష్ట్రాలకు విద్యుత్ వెలుగులు, వ్యవసాయానికి సాగు నీరు, అనేక నగరాలకు తాగు నీరు అందుతోంది. చేపల వేట సాగిస్తూ లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.

పొరుగు దేశాల సమ్మతి లేకుండానే చైనా చేపడుతున్న హైడ్రో ప్రాజెక్టులు బ్రహ్మపుత్ర పరీవాహక ప్రాంతంతో పాటు పర్యావరణానికి చేటు తీసుకొచ్చే ప్రమాదం ఉంది.  హిమాలయాల్లో అత్యంత పెద్ద లోయల్లో ఒకటైన గ్రాండ్ కన్యన్ అఫ్ యర్లూంగ్ సాంగ్పో ఒడిదుడుకులకు లోనయ్యే ప్రమాదం ఉంది. దీంతో నది ప్రవాహ తీరు తెన్నులే మారిపోతాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సారవంతమైన డెల్టాకు పేరొందిన బ్రహ్మపుత్ర నది భవిష్యత్తు కాపాడాలని కోరుతున్నారు.

టిబెట్లో ప్రాజెక్టుల నిర్మాణం ఫలితాలు లాభాల రూపంలో చైనాకు అందుతాయి. విద్యుత్ ప్రాజెక్టుల ప్రభావం ఎగువన ఉన్న చైనా కన్నా దిగువున ఉన్న భారత్, బంగ్లాదేశ్ ల మీద అధికంగా ఉంటుంది. వరదలు వచ్చినపుడు నీరు విడుదల చేయటం, వేసవిలో గేట్లు మూసివేయటం వంటి వాటితో నది ప్రవాహ తీరు తెన్నులు పూర్తిగా చైనా అధీనంలో ఉంటాయి. దీంతో భూకంపాలకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే భూకంపాలకు కేంద్రంగా ఉన్న హిమాలయాలు చైనా పన్నాగాలతో ప్రమాదపు అంచుకు చేరినట్టే. అకస్మిక వరదలు, నీరు భారీ  మొత్తంలో నిల్వ చేయటం ద్వారా కొండ చరియలు విరిగి పడటం జరుగుతుంది.

ప్రస్తుతం బ్రహ్మపుత్ర నది వరదలతో భారత్, బంగ్లా దేశాలు అవస్థలు పడుతున్నాయి. చైనా ప్రాజెక్టులు కడితే ఈ దేశాల్లో వేసవిలో నీటి ఎద్దడి, వర్షాకాలం వరదలు ముంచెత్తుతాయి. అరుదైన వృక్షసంపద, జంతుజాలం మనుగడ కష్టతరంగా మారుతుంది. ప్రపంచంలో పెద్ద నదీ ద్వీపకల్పమైన మజులీ బ్రహ్మపుత్ర నదిలోనే ఉంది. ఆకస్మిక వరదలు వస్తే యునెస్కో గుర్తింపు పొందిన మజులీ ద్వీపకల్పం తీవ్రమైన కోతకు గురవుతుంది. చైనా తీరు మారక పోతే రాబోయే రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల నైసర్ఘిక స్వరూపమే మారుతుందనటంలో సందేహం లేదు.

చైనా దురాగతాల్ని అంతర్జాతీయ వేదికల మీద ఎండగడతామని భారత్, బంగ్లాదేశ్ లు ప్రకటించాయి. ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో ప్రస్తావించి చైనా దుష్ట చేష్టలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు భారత్, బంగ్లా సిద్ధమయ్యాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్