చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అమెరికా పర్యటన వార్తల్లో హాట్ టాపిక్ నిలిచింది. అంతర్జాతీయంగా జింపింగ్ పర్యటనపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. శాన్‌ఫ్రాన్సిస్కో వేదికగా ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార మండలి (APEC) శిఖరాగ్ర సదస్సుకు యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఆహ్వానం మేరకు జిన్‌పింగ్ అగ్రరాజ్యం వెళ్లారు. జిన్‌పింగ్ సుమారు ఆరేళ్ల తర్వాత అమెరికా పర్యటనకు వెళ్లడం ఇదే మొదటిసారి. చివరిసారిగా ఆయన 2017లో పర్యటించారు.
అమెరికా, చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్న సుమారు నాలుగేళ్ల తర్వాత ఇరు దేశాల అధ్యక్షులు బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరు దేశాల అధినేతల మధ్య సుమారు నాలుగు గంటలపాటు జరిగిన సమ్మిట్‌లో ద్వైపాక్షిక సంబంధాలతోపాటు పలు అంశాలపై చర్చించారు.
భేటీ అనంతరం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ‘నియంత’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. బుధవారం వారిద్దరి సమావేశం తర్వాత జో బైడెన్ మీడియాతో మాట్లాడారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఇంకా ‘నియంత’గా కనిపిస్తున్నారా? అని మీడియా జర్నలిస్టులు ప్రశ్నించారు. దీనికి ‘అవును. ఆయన అలాగే కనిపిస్తున్నారు’ అని బైడెన్ సమాధానమిచ్చారు.
అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్-హమాస్ పోరు నేపథ్యంలో బైడెన్, జిన్‌పింగ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నది. మరోవైపు డ్రాగన్ దేశం పాలస్తీనీయులకు మద్దతుగా వ్యాఖ్యలు చేసింది.
దక్షిణ చైనా సముద్రాన్ని ఆనుకుని ఉన్న వియత్నాం, తైవాన్, మలేషియా, ఫిలిప్పీన్స్ మరియు బ్రూనై దేశాలతో చైనాకు సముద్ర జలాల వివాదాలు ఉన్నాయి. శతాబ్దాలుగా దక్షిణ చైనా సముద్రంలో భూభాగంపై గొడవ పడుతూనే ఉన్నాయి. చైనా సైనిక పరాక్రమం వేగంగా పెరిగిన తరువాత ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తైవాన్ జలసంధిలో ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్తత నెలకొంది. తైవాన్ తో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా… యుద్ద విన్యాసాలు, సైనిక బలగాల మోహరింపుతో గిల్లికజ్జాలు పెడుతోంది.
2020లో లడఖ్‌లోని గల్వాన్‌లోయలో డ్రాగన్ సైనికులు భారత్‌లోకి చొచ్చుకొచ్చారు. పెట్రోలింగ్ పాయింట్ 15 వద్ద సరిహద్దులను చెరపివేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు దేశాల సైనికులు ఘర్షణకు దిగారు. లడఖ్‌లోని కొంత భాగం చైనా దురాక్రమణలోనే ఉంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలను చైనా ఆక్రమించుకున్నది. సరిహద్దుల్లో చైనా దురాక్రమణకు పాల్పడుతుండటంతో వాస్తావాధీన రేఖ వెంబడి (LAC) సుమారు 50 వేలకు పైగా సైనికులను భారత్ మోహరించింది.
ఇన్ని వివాదాలు, ఆరోపణలు ఉంటే జింపింగ్ ప్రపంచాన్ని బుకాయించేలా మాట్లాడారు. విదేశాలకు చెందిన ఒక్క అంగుళం భూమిని తాము ఆక్రమించలేదని అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అనటం హాస్యాస్పదం. ఏ దేశంతో వివాదాలను కొనితెచ్చుకోలేదని, యుద్ధాన్ని ప్రేరేపించలేదని బైడెన్‌తో భేటీ తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీపుల్స్ రిపబ్లిక్ స్థాపించినప్పటి నుంచి అంతకు ముందు చైనా యుద్ధాన్ని ప్రేరేపించలేదని, ఒక్క అంగుళం విదేశీ భూమిని ఆక్రమించలేదన్నారు.