తెలుగు సినిమా చరిత్రలో ఆణిముత్యాలు అనదగిన సినిమాలను ఏరితే వాటిలో విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చినవి ఎక్కువగా కనిపిస్తాయి. అలాంటి విశ్వనాథ్ జయంతిని నిన్న పలువురు సినిమా ప్రముఖులు ఘనంగా నిర్వహించారు. విశ్వనాథ్ తో తమకి గల అనుబంధాన్ని గురించి ఈ వేదిక ద్వారా పంచుకున్నారు. చిరంజీవి మాట్లాడుతూ .. “విశ్వనాథ్ గారితో మూడు సినిమాలు చేశాను. ఆయనతో ఫస్టు సినిమా చేసే ఛాన్స్ వచ్చినప్పుడు అందరూ కూడా భయపెట్టారు. కానీ ఆయనతో సినిమా చేయడం వల్లనే నటన నేర్చుకునే అవకాశం లభించింది.
ఒక ఆర్టిస్ట్ నుంచి తనకి కావలసిన అవుట్ పుట్ ను రాబట్టుకోవడమెలాగో విశ్వనాథ్ వారికి తెలుసు. ప్రతి షాట్ తరువాత చాలా బాగా చేశారంటూ అభినందించడం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేది. ‘స్వయంకృషి’ .. ‘ఆపద్బాంధవుడు’ వంటి సినిమాలు నాకు మంచి పేరు తీసుకురావడానికీ .. ఆ సినిమాలలో నేను బాగా చేయడానికి ఆయనే కారకులు. నాకు అవార్డులు తెచ్చిపెట్టిన దర్శకుడు ఆయన. ఒక షూటింగులో నేను భోజనం చేయనని అంటే, చేయవల్సిందేనని పెరుగన్నం కలిపి పెట్టినవారాయన.
విశ్వనాథ్ వారితో కలిసి పనిచేయడం వలన నేను ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఇప్పటి దర్శకులకు టిప్స్ లా వాటిని చెబుతుంటాను. ఆయనను తరచూ కలుస్తూ ఉండేవాడిని .. అప్పుడు ఆయన ఆనాటి విషయాలను గుర్తుచేసేవారు. ఆయన నాకు దర్శకుడు .. గురువు .. పితృ సమానులు. ఆయన సినిమాల ద్వారా ఆయన ఎప్పటికీ మన మధ్యనే ఉంటారు” అంటూ చెప్పుకొచ్చారు.