Story goes on: చిరంజీవి గరికపాటిని వదిలిపెట్టేలా లేరు. అలాయ్ బలాయ్ వేదిక మీద గరికపాటి మాటలు చిరంజీవికి గట్టిగా తగిలినట్లున్నాయి. మరిచిపోలేకపోతున్నారు. తనంతవాడిని ఆఫ్టరాల్ ఒక గోచీ పండితుడు అలా అనడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లున్నారు. కలలో కూడా గడ్డిపరక- గరికపాటి- బ్రహ్మాస్త్రాలే వెంటపడుతున్నట్లున్నాయి.
రామాయణంలో పిడకల వేట, పానకంలో పుడకలా ఏదో జరిగింది. తన తప్పు లేకపోయినా తను ఎలా మాట పడాల్సి వచ్చిందో గాడ్ ఫాదర్ విజయోత్సాహ ఇంటర్వ్యూల్లో పదే పదే చిరంజీవి పూసగుచ్చి గుచ్చి వివరించుకున్నారు. మనం విసుగు లేకుండా విన్నాం. గరికపాటి ఎక్కడన్నా కనపడితే చొక్కా పట్టుకుని నిలదీయాలన్నంత కోపాన్ని మనలోకి ఎక్కించుకున్నాం.
ఎవరితో అయినా అపార్థాలుంటే తనే వారింటికి వెళ్లి సర్దుబాటు చేసుకుంటాను అన్న చిరంజీవి తాజా మాటలకు చానెళ్లు వేసిన పాత వీడియోలు చూసి ఔదార్యాన్ని అభినందిస్తూనే ఉన్నాం.
నాగబాబు ‘ఆపాటి అసూయ’, అనంత్ శ్రీరామ్ ‘గరికపోచ రామాయణం’, ఉత్తేజ్ ‘సరస్వతి భిక్ష’ సిద్ధాంతాలన్నీ విన్నాం. ఈ మాటలేవి చిరంజీవి అనలేదు కాబట్టి…ఆయన సంస్కారాన్ని పొగుడుతూనే ఉన్నాం. ఈ మాటలన్నవారిని ఆయన నియంత్రించలేదు, ఖండించలేదు కాబట్టి…ఆయన వారిని ప్రోత్సహించినట్లే అని మనమేమీ పొరబడలేదు.
అయ్యిందేదో అయ్యింది.
ఏది తప్పో? ఏది ఒప్పో?
ఎవరిది తప్పో? ఎవరిది ఒప్పో?
ఎవరి కోణం వారిది.
గరికపాటి కథ కంచికి వెళ్లిందని అందరూ అనుకుంటున్న సమయంలో మళ్లీ ఆ కథను సజీవంగా చర్చలో ఉంచడానికి చిరంజీవి ప్రయత్నిస్తున్నట్లున్నారు.
ఉద్దేశపూర్వకమో, కాకతాళీయమో తెలియదు కానీ…తాజాగా ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మహిళలు వేదిక మీద తనతో సెల్ఫీలు తీసుకోవడానికి పోటీలు పడుతుంటే… “ఇక్కడ వారు లేరు కదా!” అని చిరంజీవి గరికపాటిని గుర్తుకు తెచ్చుకున్నారు. దాంతో సభలో కరతాళధ్వనులు. షరా మామూలుగా సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ గా తిరుగుతోంది.
చిరంజీవికి మనసులో ఏమీ లేకుండా అలవోకగా, సరదాగా అన్న మాటే అయి ఉండవచ్చు అని అనుకోవడానికి వీల్లేకుండా అడిగినవారి ముందు, అడగని వారి ముందు…ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎక్కడపడితే అక్కడ చిరంజీవి ఎందుకు గరికపాటినే తలచుకుంటున్నారు?
చిరంజీవి లాంటి సెలెబ్రెటీలకు ఇలాంటివి కీర్తిని తెచ్చి పెట్టవు.
తెగేదాకా లాగాలని చిరంజీవి అనుకుంటూ ఉంటే…చేయగలిగింది లేదు.
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :