మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ కాంబినేషన్లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ వాల్తేరు వీరయ్య. ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో మెగా మాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ‘వీరయ్య విజయ విహారం’ సక్సెస్ సెలబ్రేషన్స్ ని వరంగల్ హన్మకొండలో గ్రాండ్ గా నిర్వహించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ వేడుకలో ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు. భారీ ఎత్తున ప్రేక్షకులు, అభిమానులు హాజరయ్యారు. చిరంజీవి చేతుల మీదగా చిత్ర యూనిట్ కు షీల్డ్స్ ప్రదానం చేశారు.
చిరంజీవి మాట్లాడుతూ “వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నాం కానీ నాన్ బాహుబలి, నాన్ ఆర్ఆర్ఆర్ స్థాయి సినిమా అవుతుందని మేము ఊహించలేదు. నాన్ ఎస్ఎస్ఆర్ సినిమాల రికార్డ్స్ కి వచ్చిందంటే.. ఇంత గొప్ప విజయానికి అగ్ర తాంబూలం ఇవ్వాల్సింది ప్రేక్షకులకే. ప్రేక్షకుల హృదయపూర్వక కృతజ్ఞతలు. వాల్తేరు వీరయ్య 250 కోట్ల గ్రాస్ కి చేరబోతుందంటే అది ఆషామాషీ విషయం కాదు. ప్రేక్షకులు నన్ను ఎలా చూడాలని అనుకున్నారో అలా మళ్ళీ తెర పై చూస్తూ ఒక ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్… ఇలాంటి సినిమాలని గుర్తు చేసుకోవడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి ఫీలింగ్ మీకు నాకు కలిగించడానికి ప్రధాన కారణం దర్శకుడు బాబీ”
“నాపై అభిమానంతో బాబీ ఇండస్ట్రీకి రావడం, ఎప్పటికైనా నాతొ సినిమా చేయాలనీ కోరుకోవడం… అది మామూలు సినిమా కాలేదు. ఖైదీ సినిమా నాకు ఎలాంటి స్టార్ డమ్ తీసుకొచ్చిందో .. దర్శకుడిగా బాబీని వాల్తేరు వీరయ్య ఒక స్టార్ డైరెక్టర్ ని చేసింది. బాబీ ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. ఈ సినిమా కోసం బాబీ పని చేసిన తీరుకు నేను అభిమాని అయిపోయాను. ఎక్కడా వృధా లేకుండా బాబీ సినిమా చేశాడు. ఈ విషయంలో బాబీని యువ దర్శకులు స్ఫూర్తిగా తీసుకోవాలి. రవితేజని చూస్తే నాకు మరో పవన్ కళ్యాణ్ గా అనిపిస్తాడు. రవితేజతో ఇందులో కీలకమైన సన్నివేశం చేస్తున్నపుడు నాకు పవన్ కళ్యాణ్ నే గుర్తుకు వచ్చాడు. పవన్ అని ఊహించుకొని ఆ సీన్ చేశాను. అందుకే అది అంత అద్భుతంగా పండింది”
“అలాగే వాల్ పోస్టర్ సీన్ లో కూడా నా తమ్ముడిలానే చేశాను. షూటింగ్ చేస్తున్నపుడే థియేటర్ లో ప్రేక్షకుల స్పందన ఎలా వుంటుందో ఊహించుకుంటాను. విజల్స్ చప్పట్లు నాకు చెవిలో మ్రోగుతూనే వుంటాయి. అభిమానుల అందించే ప్రోత్సాహం వలనే ఇంత ఉత్సాహంగా వుండగలుగుతున్నాను.ఇలాంటి వీరయ్యలు ఎన్నైనా చేసే సత్తా ప్రేక్షకులు అభిమానులు ఇస్తున్నారు. దీనికి మరోసారి నా కృతజ్ఞతలు తెలియస్తున్నాను. రంగస్థలం చేస్తున్నపుడు మైత్రీ మూవీ మేకర్స్ గురించి చరణ్ చెప్పేవాడు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలని చెప్పేవాడు. నేను మళ్ళీ సినిమాలు చేస్తే మాతో సినిమా చేసే అవాశం ఇవ్వండని మైత్రీ నిర్మాతలు కోరారు. అప్పుడే మాట ఇచ్చాను. ఇప్పుడు వాల్తేరు వీరయ్యతో ఓ అద్భుతమైన విజయంతో ఇది జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు నిజమైన నిర్వచనంగా నిలబడ్డారు. ప్రేక్షకులకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు’’ అన్నారు.