Saturday, January 18, 2025
Homeసినిమాసినీ కార్మికులకు నేను ఎప్పుడూ అండగా ఉంటాను - చిరంజీవి

సినీ కార్మికులకు నేను ఎప్పుడూ అండగా ఉంటాను – చిరంజీవి

చిత్రపురి కాలనీలో సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, నిర్మాతలు సి కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, చిత్రపురి కాలనీ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, ఎఫ్ డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం, ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, మణికొండ మున్సిపల్ లీడర్స్ తదితరులు పాల్గొన్నారు. నేడు చిత్రపురిలో  1,176 ఎంఐజీ, 180 హెచ్ఐజీ డూప్లెక్స్ ఫ్లాట్స్ ఓనర్స్ కు చిరంజీవి చేతుల మీదుగా ఇంటి తాళాలు అందజేశారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ… మా సినీ కార్మికుల సమక్షంలోకి అతిథిగా రావడం సంతోషంగా ఉంది. మనం తిన్నా తినకున్నా మనకొక ఇళ్లు ఉంటే ఆ తృప్తే వేరు. ఆ సొంతింటి కలను మన సినీ కార్మిక సోదరులకు నిజం చేసిన ఈ చిత్రపురి కమిటీ వారికి అభినందనలు. ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సింది స్వర్గీయ ఎం ప్రభాకర్ రెడ్డి గారిని. ఆయన దూరదృష్టితో ఈ సొసైటీ కోసం చేసిన కృషి ప్రశంసనీయం. ఆయన కల ఇవాళ నెరవేరింది. దాసరి, రాఘవేంద్రరావు, భరద్వాజ లాంటి వారందరూ దీన్నోక అద్భుతమైన సొసైటీగా తీర్చిదిద్దారు. భారత దేశంలో మరే సినీ పరిశ్రమలోనూ సినిమా కార్మికులకు ఇంత పెద్ద గృహసముదాయం లేదు.

ఈ కమిటీ చాలా నిజాయితీగా పని చేస్తుండటం వల్లే పనులు జరుగుతున్నాయి. సి కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వాళ్లంతా నన్ను ఇండస్ట్రీ పెద్ద అంటున్నారు. వాళ్ల వయసు తగ్గించుకునేందుకు నన్ను పెద్ద అంటున్నారేమో అనిపిస్తోంది. చిత్ర పరిశ్రమ నాకెంతో ఇచ్చింది. అందులో నుంచి నా వంతుగా సినీ కార్మికులకు, కళాకారులకు సాయం చేస్తాను. నేను ఎదిగానని పెద్దరికం చేయాలని లేదు. సినీ కార్మికులకు నేను ఎప్పుడూ అండగా ఉంటాను. అవసరం వచ్చినప్పుడు మీ వెంట ఉండేది నేనే. మీకు కష్టం వస్తే నా ఇంటి తలుపు తట్టండి అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్