‘సినిమా రంగంలో సినిమా జర్నలిస్టులు కూడా ఒక భాగమేనని, సినిమా రంగానికీ ప్రేక్షకులకూ మధ్య వారధి లాంటి వ్యవస్థ సినిమా జర్నలిజం’ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఒకరి అవసరం ఇంకొకరికి ఎప్పుడూ ఉంటుందని, సినిమా జర్నలిస్టుల సంక్షేమానికి తాను వెన్నుదన్నుగా నిలుస్తానని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్ లోని కోకాపేటలో వేసిన ‘ఆచార్య’ సెట్ లో ఆయన ఎంతో బిజీగా ఉన్నా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఆయన ఎంతో సమయాన్ని కేటాయించి సీనియర్ జర్నలిస్ట్ ప్రభు అధ్యక్షుడిగా, పర్వతనేని రాంబాబు ప్రధాన కార్యదర్శిగా కొత్త కమిటీని సెట్ కు ఆహ్వానించారు.
ఈ నూతన కమిటీ ఏర్పాటైన వెంటనే కమిటీ అందరికీ మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలియచేసిన విషయం తెలిసిందే. కొత్త కమిటీ అధ్యక్ష, కార్యదర్శులకు చిరంజీవి పుష్ఫగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సురేష్ కొండేటి కూడా పాల్గొన్నారు. అసోసియేషన్ భవిష్యత్ కర్యచారనపై అడిగి తెలుసుకున్నారు చిరంజీవి. గత ఏడాది కరోనా సమయంలో సీసీసీ ద్వారా చేసిన సహాయ కార్యక్రమాల్లో తమకు కూడా చోటు కల్పించినందుకు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ మెగాస్టార్ చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపింది.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. “సినిమా జర్నలిస్టులతో తనకు మొదటి నుంచి విడదీయరాని అనుబంధం ఏర్పడింది. ఈ అసోసియేషన్ కు ఎలాంటి సహాకారం కావాలన్నా తన వంతు సహాయం అందిస్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ చాలా అవసరం. సభ్యులందరికీ అసోసియేషన్ ఈ సదుపాయం కల్పించాలి. గృహవసతి, పెన్షన్ లాంటి సదుపాయల గురించి కూడా ఆలోచించి ముందడుగు వేయండి. అసోసియేషన్ నిర్వహించబోయే గోల్డెన్ జూబ్లి ఉత్సవాలకు తన వంతు సహాయ సహకారాలు అందజేస్తాను. మీకు ఏ సహాయం కావాలన్నా, మీరు నిర్వహించే కార్యక్రమాలకు ఎప్పుడూ అందుబాటులో వుంటాను” అన్నారు.
మూడు గంటలకు పైగా..
ఆచార్య షూటింగ్ లో ఎంతో బిజీ ఉన్నప్పటికీ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం కోసం మూడు గంటలకు పైగా సమయాన్ని కేటాయించడం విశేషం. కమిటీలోని ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించారు. జర్నిలిస్ట్ ల కోసం ఎంతో సమయాన్ని కేటాయించి ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవికి అధ్యక్షుడు ప్రభు ప్రధాన కార్యదర్శి పర్వతనేని రాంబాబు మరియు ఇతర కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం పాల్గొన్న వారిలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఓగిరాల మోహనరావు, నాగేంద్ర కుమార్, ఎల్.రాంబాబు వర్మ, కోశాధికారి హేమసుందర్ పామర్తి, కార్యవర్గ సభ్యులు సురేష్ కవిరాయని, ధీరజ్ అప్పాజీ, టి. మల్లికార్జున్, జిల్లా సురేష్, అబ్దుల్, వీర్ని శ్రీనివాస్, కుమార్ వంగాల, సి.హెచ్. నవీన్ కలిసిన వారిలో వున్నారు. దర్శకుడు కొరటాల శివ, నిర్మాత అల్లు అరవింద్ లు కూడా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కొత్త కమిటీకి అభినందనలు తెలిపారు.