భూమన కరుణాకర్ రెడ్డి సేవలను పార్టీలు తగిన విధంగా ఉపయోగించుకోలేక పోయాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాజకీయాల్లో నిజం చెప్పడం ఎంతో కష్టమని, చేసిన తప్పును ఒప్పుకోవడానికి కూడా ఎంతో ధైర్యం కావాలని, రెండు తప్పులు చేశానంటూ భూమన ఒప్పుకోవడం, క్షమాపణ చెప్పడం ఎంతో గొప్ప విషయమన్నారు. గాంధీజీ ఆత్మ కథ ‘సత్య శోధన’ ను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పునర్ ముద్రించారు. తిరుపతిలో జరిగిన ఒక కార్యక్రమంలో జస్టిస్ రమణ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమన ఇంకా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారని, ఆయన ఈ పుస్తకం విడుదల చేయడం, తనతో సన్నిహితంగా ఉండడం ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో వేచిచూడాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎంతో గొప్ప మనసుతో, పరివర్తన చెందిన మానవతావాదిగా కరుణాకర్ రెడ్డి రుజువు చేసుకున్నారని రమణ ప్రశంసించారు. ఎమర్జెన్సీ లో అరెస్టయిన అతి పిన్న వయస్కుడు భూమన అని, ఎంతో మేధావులతో ఆయన జైలు జీవితం గడిపారని పేర్కొన్నారు. తిరుపతిలో మద్యం షాపులు ఎక్కువగా ఉండడంపై 2012లో ఆయన తన వద్ద ఎంతో ఆవేదన వ్యక్తం చేశారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను భూమన చెప్పడం సామాన్యమైన విషయం కాదన్నారు. విశాల దృక్పథంతో పార్టీ రాజకీయాలకు అతీతంగా తన అభిప్రాయాలు చెప్పగలిగిన వ్యక్తి అని ప్రశంసించారు. ఆయన ముక్కుసూటితనమే దీనికి కారణమై ఉండొచ్చన్నారు. ప్రజల కోసం భూమన సేవలు వాడుకుంటారని భావిస్తున్నానని, తద్వారా తెలుగు ప్రజలకు మేలు చేయవచ్చని చెప్పారు.
తనపై కొన్ని సందర్భాల్లో ఎవరైనా దుష్ప్రచారం చేయాలని చూసినప్పుడు కూడా ఏమాత్రం సహించేవారు కాదని, దాని వల్ల ఆయనకు వచ్చే అవకాశాలు పోతాయని తెలిసినా, కొంతమందికి శత్రువు అవుతాడని తెలిసినా కరుణాకర్ రెడ్డి తనకోసం నిలబడ్డారని, అయన తన ఆప్త మిత్రుడు, అపూర్వ సహోదరుడు, సొంత సోదరుడి కన్నా గొప్పవాడని జస్టిస్ రమణ భావోద్వేగంతో కూడిన ప్రసంగం చేశారు. గతంలో భూమన ఎంగో గొప్పగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించారని, తాను చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడే మరోసారి నిర్వహించాలని అనుకున్నా అది సాధ్యపడలేదన్నారు. భవిష్యత్తులో అయన ఆధ్వర్యంలోనే ఘనంగా మరోసారి తెలుగు ఉత్సవాలు జరగాలని చీఫ్ జస్టిస్ ఆకాంక్షించారు.