సిఆర్డీయే ప్రాంతంలో పేదలకు ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇళ్లపట్టాలు పంపిణీ చేసిన అనంతరం…. వెంటనే దీనికి సంబంధించిన కార్యాచరణ మొదలు పెట్టాలని సూచించారు. ఇళ్లులేని నిరుపేదలకు సాధ్యమైనంత త్వరగా ఇళ్లు కట్టించి అప్పగించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. క్యాంపు కార్యాలయంలో గృహనిర్మాణశాఖపై సిఎం జగన్ సమగ్ర సమీక్ష చేపట్టారు.
పేదలకు ఎంతత్వరగా ఇళ్లు సమకూరిస్తే.. వారి జీవితాలు అంతగా బాగుపడతాయని…. ఈ ఇళ్లపట్టాలతో పాటు నిర్మాణం పూర్తయిన 5024 టిడ్కో ఇళ్లను కూడా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేయాలని అధికారులకు సిఎం స్పష్టం చేశారు. పట్టాల పంపిణికీ అన్నిరకాల చర్యలు తీసుకున్నామని, ల్యాండ్ లెవలింగ్ పనులు చేశామని అధికారులు వివరణ ఇచ్చారు.
‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. గడచిన 45 రోజుల్లో హౌసింగ్ కోసం రూ.1085 కోట్లు ఖర్చు చేశామని, ఇప్పటివరకూ 3.70 లక్షల ఇల్లు పూర్తయ్యాయని, రూఫ్ లెవల్.. ఆపైన నిర్మాణంలో ఉన్నవి 5.01లక్షలు ఉన్నాయని, మరో 45 రోజుల్లో వీటిని పూర్తిచేస్తామని చెప్పారు. బేస్‌మెంట్ లెవల్ దాటి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నఇళ్లు 8.64లక్షలపైనే ఉంటాయని, వీటి పనులనూ వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఇళ్ల లబ్ధిదారులైన మహిళల్లో ఇప్పటివరకూ 11.03 లక్షలమందికి రూ. 35 వేల చొప్పున రూ. 3886.76 కోట్లమేర పావలా వడ్డీకే రుణాలు అందించామని వెల్లడించారు.
ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.