ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నారు. పదిన్నర గంటల ప్రాంతంలో మోడీ నివాసానికి చేరుకున్న జగన్ ఆయనతో షుమారు అరగంటకు పైగా సమావేశమయ్యారు. సిఎం జగన్ వెంట ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రధాని దృష్టికి సిఎం తీసుకెళ్ళారు.
గత నెలలో గోదావరికి భారీ ఎత్తున వరదలు వచ్చిన సమయంలో పోలవరం ముంపు బాధితులు పడిన కష్టాన్ని స్వయంగా చూసిన సిఎం జగన్ వారికి త్వరితగతిన పురనావాసం ఏర్పాటు చేయాల్సి ఉందని, దీనికోసం నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాల మేరకు నిధుల విడుదల, నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, రెవెన్యూ లోటు నిధుల విడుదల తదితర విషయాల గురించి ప్రధానికి వినతి పత్రం ఇచ్చారు.
కాసేపట్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో జగన్ సమావేశం కానున్నారు. ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌కర్‌లను కూడా సీఎం కలిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ను కలుసుకోనున్నారు.