వరద బాధితుల్లో నైతిక స్థైర్యం దెబ్బతీయడానికి చంద్రబాబు, ఈనాడు, టీవీ–5, ఆంధ్రజ్యోతి, పవన్‌కళ్యాణ్ వంటివారు ప్రయత్నిస్తున్నారని, ప్రభుత్వంపై అకారణంగా బురదజల్లుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర, అధికారుల ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కొందరికి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చడానికి ఇలాంటి ప్రచారాలు వారు చేస్తారని, మనం మంచి చేస్తున్నప్పుడు వెనకడుగు వేయాల్సిన అవసరంలేదని, ఇలాంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు. దురుద్దేశపూర్వకంగా చేసే ప్రచారాన్ని, వదంతులను తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో సచివాలయం నుంచి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా బాధితులకు వరద సహాయ, పునారావాస కార్యక్రమాలో అధికార యంత్రాంగం అవిశ్రాంతంగా పనిచేస్తోందని సిఎం ప్రశంసించారు. క్షేత్ర స్థాయిలో ఎలాంటి సాయం అందించేందుకైనా సిద్ధంగా ఉన్నామని, నిధుల సమస్య లేనే లేదని స్పష్టం చేశారు. ‘మీరు ప్రోయాక్టివ్‌గా మందుకు వెళ్లండి, ఎలాంటి సమస్య ఉన్నా.. పరిష్కరించడానికి ఫోన్‌కాల్ చేస్తే చాలు’ అని అధికారులకు భరోసా ఇచ్చారు.
సిఎం చేసిన సూచనలు:
- రానున్న 48 గంటల్లో ఏ ఇల్లుకూడా మిగిలిపోకుండా రూ.2వేల సహాయం అందాలి
- అలాగే 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పామాయిల్‌తో కూడిన రేషన్ పంపిణీ జరగాలి
- ఈ రేషన్ వదర బాధిత కుటుంబాలకు వచ్చే 48 గంటల్లో అందాలి
- మంపునకు గురైన ప్రతి గ్రామంలో పంపిణీని ముమ్మరం చేయాలి
- కలెక్టర్లు, సీనియర్ అధికారులు దీన్ని సవాల్‌గా తీసుకోవాలి
- గతంలో రెండు జిల్లాలకు ఇద్దరు కలెక్టర్లు మాత్రమే ఉండేవారు
- ఇద్దరు జాయింట్‌కలెక్టర్లు, ఇద్దరు ఎస్పీలు మాత్రమే ఉండేవారు
- ప్రస్తుతం కాకినాడతో కలుపుకుని ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జేసీలు, ఆరుగురు ఎస్పీలు ఉన్నారు
- గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ కూడా మీకు అందుబాటులో ఉంది
- ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉన్నారు
- ప్రతి 50 ఇళ్లకూ ఒక వాలంటీర్ ఉన్నారు
- ఇలాంటి వ్యవస్థకు ఇప్పుడు మీకు అందుబాటులో ఉంది
- నాణ్యమైన సేవలు అందించాలి
- పంపిణీని ముమ్మరం చేయాలి
- ఇంత వ్యవస్థతో ఎప్పుడూ జరగని విధంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం
- గతంలో ఎప్పుడూ కూడా రూ.2వేల ఆర్థిక సహాయం చేయలేదు
- అనేక స్కూళ్లను ప్రభుత్వ కార్యాలయాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు
- వీటిని తిరిగి అప్పగించేటప్పుడు వాటిని పరిశుభ్రంగా అందించాలి… అంటూ అధికారులకు సిఎం నిర్దేశించారు.
సమీక్షా సమావేశానికి హోం, విపత్తు నిర్వహణశాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కే వి రాజేంద్రనాథ్ రెడ్డి, విపత్తు నిర్వహణశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Also Read : పవన్ క్షమాపణ చెప్పాలి:బొత్స డిమాండ్