చర్చిలు, వాటి ఆస్తుల రక్షణకై తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. జిల్లా స్దాయిలో సమస్యల పరిష్కారానికి కలెక్టర్, ఎస్పీలు కృషిచేస్తారని చెప్పారు. ఇకపై క్రిస్టియన్ సమాజం, సంఘాల ప్రతినిధుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించేందుకు ఒక సలహాదారును నియమిస్తామని భరోసా ఇచ్చారు. తద్వారావారి సమస్యలను సులభంగా పరిష్కరించే వెసులుబాటు ఉంటుందని అభిప్రాయపడ్డారు. క్రిస్టియన్లకు స్మశానవాటికల ఏర్పాటుపైనా సిఎం సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ సమావేశమయ్యారు. బిషప్‌లు, రెవరెండ్‌లు ఇతర క్రైస్తవ సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు.
చర్చిల ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. ఛారిటీ సంస్ధలు నడుపుతున్నవారికి స్ధానిక పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలని క్రైస్తవ సంఘాలు సీఎంకు విజ్ఞప్తి చేశాయి. క్రైస్తవ సంఘాల ప్రతినిధులు విన్నవించిన పలు అంశాలపై సీఎం సానుకూలంగా స్పందించారు.