సిఎం జగన్ గోదావరి జిల్లాల వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన ఓ ఈవెంట్ లా సాగిందని తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఏయే గ్రామాల్లో పర్యటించాలి, ఏయే ఇళ్ళ దగ్గర ఆగాలి, ఎవరితో ముఖా ముఖి నిర్వహించాలనేది ముందుగానే నిర్ణయించి, మంత్రులు వారికి తర్ఫీదు కూడా ఇచ్చారని ఎద్దేవా చేశారు. సిఎం పర్యటన అంతా బారికేడ్ల మాటున, పరదాల చాటున మొక్కిబడిగా సాగిందన్నారు. నాయకుడు అనేవాడు ముందుండి నడిపించాలి గానీ వారం రోజుల తర్వాత రావడం సరికాదన్నారు.
హుదుద్, తిత్లీ తుఫానుల సమయంలో చంద్రబాబు రోజుల తరబడి అక్కడే ఉంది సహాయ చర్యలు పర్యవేక్షించారని, 1996లో గోదావరి వరదల సమయంలో ఒక్క చీఫ్ సెక్రటరీ తప మిగిలిన ప్రిన్సిపాల్ సెక్రటరీలు అందరినీ రప్పించి పునరావాస కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు.
సిఎం జగన్ వస్తున్నారని వరద సాయాన్ని ఆదరా బాదరాగా అందించారని…అదే సిఎం ఇక్కడే ఉండి ఉంటే సాయం ఎప్పుడో అంది ఉండేదని రామానాయుడు పేర్కొన్నారు. వరదలపై సి డబ్ల్యూసీ ముందుగానే హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలూ తీసుకోలేదని రామానాయుడు ఆరోపించారు. వరదలు తగ్గినా విద్యుత్, రవాణా సౌకర్యాల పునరుద్ధరణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.
Also Read : గోదావరి జిల్లాల నుంచే చైతన్యం రావాలి: బాబు