Sunday, January 19, 2025
HomeTrending Newsవారి కడుపుమంటకు మందులేదు: సిఎం

వారి కడుపుమంటకు మందులేదు: సిఎం

నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని అందులో ప్రధానమైన రోడ్లన్నింటినీ త్వరిత గతిన మరమ్మతులు పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఉన్న రోడ్లు బాగుచేయడంతో పాటు కొత్త రోడ్ల నిర్మాణం లో నాణ్యత పాటించాలని, రెండేళ్లకే రిపేర్లకు వచ్చే అవకాశం ఉండకూడదని స్పష్టం చేశారు. ఆర్‌ అండ్‌ బి శాఖపై క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.  పంచాయితీరాజ్, పురపాలక, గిరిజన సంక్షేమశాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

పట్టణాలు, నగరాల్లో ఎప్పటికప్పుడు రోడ్ల రిపేర్లను చేసేందుకు ఉద్దేశించిన ఏపీసీఎం ఎంఎస్‌ యాప్‌ను సమీక్షా సమావేశంలో  సీఎం ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు వంటి జిల్లాల్లో నేల స్వభావం రీత్యా రోడ్లు త్వరగా పాడైపోతున్నాయని, భారీ వాహనాలు తిరిగే సరికి కుంగిపోతున్నాయని అధికారులు సమావేశంలో వివరణ ఇచ్చారు.  ఇలాంటి చోట్ల పుల్ డెప్త్ రిక్లమేషన్‌ (ఎఫ్‌డీఆర్‌) టెక్నాలజీని వాడాలని అధికారులు ప్రతిపాదించగా సిఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

సమీక్ష సందర్భంగా సిఎం మాట్లాడుతూ…

  • రోడ్డు వేశాక కనీసం ఏడేళ్లపాటు పాడవ్వకుండా ఉండేలా చూసుకోవాలి.
  • దీనివల్ల క్రమం తప్పకుండా రోడ్లు మెయింటెనెన్స్‌ అవుతాయి. నిర్వహణకూడా సజావుగా, నాణ్యతతో సాగుతుంది.
    దీనిపై అధికారులు దృష్టిపెట్టాలి.
  • మొదటి దశలో వేయి కిలోమీటర్ల మేర ఎఫ్‌డీఆర్‌ టెక్నాలజీతో చేపట్టాలి
  • వచ్చే జూన్, జులైకల్లా ఈ పద్ధతిలో నిర్దేశించుకున్న మేరకు రోడ్లు వేయాలి
  • అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిలను కూడా పూర్తిచేయాలి
  • కడప, బెంగళూరు రైల్వేను లైనుపై దృష్టిపెట్టాలి
  • విశాఖ నుంచి భోగాపురానికి వెళ్లే రోడ్డు నిర్మాణంపైనా దృష్టిపెట్టాలి
  • రోడ్లు బాగు చేసిన తర్వాత నాడు – నేడు ద్వారా ప్రజల ముందు పెట్టాలి.
  • ఇంత ఖర్చుచేసి రోడ్లు బాగుచేస్తున్నా నెగిటివ్‌ ప్రచారం చేస్తున్నారు.
  • అన్ని ప్రభుత్వ శాఖలో నాడు– నేడు శీర్షిక కింద మనం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచాలి

  • ఆయా ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్లలో కూడా ఈ వివరాలు ఉంచాలి
  • దురుద్దేశంతో కొన్ని మీడియా సంస్థలు నెగెటివ్‌ ప్రచారం చేస్తున్నాయి.
  • ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా విష ప్రచారం చేస్తున్నాయి.
  • వారి కడుపుమంటకు మందులేదు. అందుకే మనం చేస్తున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచాలి.
  • పట్టణాలు, నగరాల్లో రోడ్ల మరమ్మతులు నాణ్యతతో జరగాలి
  • పట్టణాలు, నగరాల్లో ఎక్కడైనా ఫలానా చోట రోడ్డు రిపేరు చేయాలని పౌరుడు ఫిర్యాదుచేసిన 60 రోజుల్లో దాన్ని బాగు చేయాలి. ఈ లక్ష్యాన్ని తప్పనిసరిగా పాటించాలి
  • యాప్‌ పనితీరు, అందులో వస్తున్న ఫిర్యాదుల పరిష్కారంపై నిరంతరం సమీక్ష, పర్యవేక్షణ ఉండాలి
  • రోడ్డు మరమ్మతులలో దీర్ఘకాలం నిలిచే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి.

ఈ సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి(పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్న దొర, ఆర్‌ అండ్‌ బి మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా), పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ కార్యదర్శి కే వి వి సత్యనారాయణ, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, రవాణాశాఖ కార్యదర్శి పీ ఎస్‌ ప్రద్యుమ్న, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్