రాష్ట్ర ప్రయోజనాలు తప్ప తమకు మరో అజెండా అంటూ ఏదీ లేదని, ఉండదు…ఉండబోదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ‘కేంద్ర ప్రభుత్వంతో, మీతో మా అనుబంధం పార్టీలకు, రాజకీయాలకు అతీతం’ అంటూ మోడీకి జగన్ తెలిపారు. రాష్ట్రానికి, గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాన్ని గుర్తు పెట్టుకున్న ప్రజలు.. మీరు పెద్ద మనసు చూపుతూ ఉదారంగా చేసే ప్రతి సాయాన్ని గుర్తు పెట్టుకుంటారని భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ లో జరిగిన సభలో జగన్ ప్రసంగించారు.
ఎనిమిదేళ్ళ క్రితం జరిగిన విభజన గాయాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఇంకా కోలుకోలేదని, ఈ గాయాలు మానేలా, జాతీయ స్రవంతితో పాటు ఏపీ అభివృద్ధి చెందడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సాయం అందించాలని సిఎం విజ్ఞప్తి చేశారు. విశాల హృదయంతో కేంద్రం చేసే ప్రతి సహాయం, ప్రత్యేకంగా ఇచ్చే ప్రతి సంస్థ, అదనంగా ఇచ్చే ప్రతి రూపాయి మా రాష్ట్ర పునర్నిర్మాణానికి గొప్పగా ఉపయోగపడతాయని జగన్ అన్నారు. తమ రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఏ మంచి అయినా కూడా ఈ, ప్రాంతం, ప్రజానీకం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని ప్రధాని విజ్ఞప్తి చేశారు. విభజన హామీలు… పోలవరం, ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ వరకూ పలు సందర్భాలో తాము చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని వాటిని పరిష్కరించాలని ప్రధానిని సిఎం జగన్ కోరారు.
‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా’ అంటూ వంగపండు పాడినట్లుగా, ‘వస్తున్నాయ్… వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలు అని శ్రీ శ్రీ చెప్పినట్లుగా తాము తలపెట్టిన ఈ మహా సభకు వెల్లువలా… ఉత్తరాంధ్ర జిల్లాలనుంచి తరలివచ్చిన ప్రజానీకానికి సిఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. ‘దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అంటూ గురజాడ చెప్పిన మాటలు మనందరికీ కర్తవ్య బోధ చేస్తున్తాయని జగన్ అన్నారు. గడచిన మూడున్నరేళ్లుగా విద్య, వైద్యం- ఆరోగ్యం, రైతుల సంక్షేమం, సామాజిక న్యాయం, మహిళా సంక్షేమం, అభివృద్ధి- సంక్షేమం, పరిపాలనా వికేంద్రీకరణ, పారదర్శక పాలనతో తాము అడుగులు వేస్తున్నామని చెప్పారు. రాష్ట్రం నిలదొక్కుకోవడం అంటే రాష్ట్రంలోని ప్రతి ఇల్లూ నిలదోక్కుకోవడమేనని గట్టిగా నమ్మి, ఇంటింటా ఆత్మవిశ్వాసం నింపడానికి రాష్ట్ర ఆర్ధిక వనరులలోని ప్రతి రూపాయినీ వినియోగించామన్నారు. ‘పెద్దలు, సహృదయులు అయిన మీరు మీ సహాయ సహకారాలు అందించాల’ని, ఆశీర్వదించాలని ప్రధానమంత్రికి సిఎం జగన్ విజ్ఞప్తి చేశారు.