బిసిల సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు చెబితే మధ్య ప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నోరెళ్ళబెట్టారని బిసి సంక్షేమ సంఘం నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య వెల్లడించారు. విద్యార్థులకు అమ్మ ఒడి, పూర్తి ఫీజు రీ ఇంబర్స్ మెంట్, వసతి దీవెన పథకాలపై తాను ఆయనకు చెప్పినప్పుడు ఇంత మందికి ఇన్ని నిధులు ఇలా ఇవ్వగాలుగుతున్నారని ఆరా తీశారని చెప్పారు. ఈ రోజు విజయవాడలో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారేష్ అధ్యక్షతన జరిగిన బీసీ కులాల ఆత్మీయ సమ్మేళనంలో కృష్ణయ్య తో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, ఎమ్మెల్సీ పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ బిసిల అభ్యున్నతి కోసం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న జగన్ కు బిసిలు అండగా ఉండాలని, జగన్ ను కాపాడుకుంటే మన అవకాశాలను మనం నిలబెట్టుకున్నట్లేనని బిసిలకు పిలుపు ఇచ్చారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇలా బిసిలకు అవకాశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. బిసిల కోసం పార్లమెంట్ లో పోరాటం చేసేందుకే తనను రాజ్యసభకు పంపారని, బిసిలకు 50శాతం రిజర్వేషన్ల కోసం గట్టిగా పోరాడాలని తనకు సూచించారని చెప్పారు. ప్రభుత్వం చేసిన మేలును ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని పేర్కొన్నారు.
జగన్ ప్రభుత్వం బిసిల సంక్షేమానికి, సాధికారతకు చిత్తశుద్ధితో పనిచేస్తోందని, బిసిలు అభివృద్ధి చెందితేనే నిజమైన సామాజిక న్యాయం జరిగినట్లు అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో బిసిల స్థితిగతులు అధ్యయన చేసి వారి కోసం ఓ డిక్లరేషన్ రూపొందిస్తే… దాన్ని అమలు చేస్తారా అన్న సందేహం బిసిలతో పాటు అందరిలోనూ ఉండేదని.. కానీ సిఎం జగన్ దానిలో పేర్కొన్న ప్రతి అంశాన్నీ చేసి చూపారని సజ్జల వెల్లడించారు.
ఇంతకాలం అధికారం చెలాయిస్తున్న వర్గాలతో సమానంగా తమకూ పదవులు దక్కాలని, అవకాశాలు పొందాలన్న ఆలోచనలకు సిఎం జగన్ బాటలు వేశారనన్నారు. చంద్రబాబులాగా వారికి ఐదువేలో, పదివేల రూపాయలో ఇచ్చి చేతులు దులుపుకోలేదని, సమాజాన్ని నడిపించే చోదక శక్తులుగా తయారు చేశారని సజ్జల చెప్పారు. వ్యతిరేకత వచ్చినా, రాజకీయంగా రిస్క్ అయినా జగన్ బిసిలకు రాజకీయంగా పదవులు ఇచ్చి ప్రోత్సహించారని, ఏదో ఒక పద్ధతిలో న్యాయం జరగకపోతే ఎప్పుడో ఒకప్పుడు అశాంతి నెలకొంటుందని, అందుకే అవకాశాలు కల్పించారన్నారు.