శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి నేడు ప్రయోగించిన ఎల్వీఎం-3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. దీనిద్వారా ఒకేసారి 36 ఉపగ్రహాలను కక్ష్య లోకి పంపారు. 644 టన్నుల బరువైన ఈ రాకెట్ 1200 కిలోమీటర్ల ఎత్తుకు ఈ 36 ఉపగ్రహాలను మోసుకెళ్ళింది. ఈ ప్రయోగంతో తొలిసారి ప్రపంచ వాణిజ్య విపణిలోకి ఇస్రో ప్రవేశించినట్లయ్యింది. యూకేతో 108 ఉపగ్రహాలకు ఒప్పందం చేసుకున్న ఇస్రో మొదటి విడతగా ఈ 36 ఉపగ్రహాలను పంపింది.
ఎల్వీఎం-3 విజయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఒకేసారి కక్ష్య లోకి 36 ఉపగ్రహాలను పంపి భారతీయ అంతరిక్ష ప్రతిభను మరోసారి నిరూపించారని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు ఇస్రో సాధించాలని సిఎం జగన్ ఆకాంక్షించారు.