నేడు కురుపాం బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ముఖ్యమంత్రి జగన్ నేరుగా విమర్శలు సంధించారు. దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్ అంటూ విరుచుకుపడ్డారు. 2014 ఎన్నికల్లో కూడా టిడిపికి మద్దతుగా నిలిచారని, ఎన్నికలు కాగానే టిడిపి తన మేనిఫెస్టోను చెత్త బుట్టలో పడేస్తే ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఐదేళ్ళలో ఒక్కసారి కూడా మాట్లాడలేదని అలాంటి ఈ స్టార్ ఇప్పుడు ఓ లారీ ఎక్కి వూగిపోతున్నాడని, నచ్చని వారిని చెప్పుచ్చుకు కొడతానని, తాట తీస్తానని, గుద్దలూదదీస్తానని మాట్లాడుతున్నాడని, ఈ మనిషి నోటికి అదుపులేదు, మనిషికి నిలకడ లేదని, ఆయనలా తాము ఊగిపోయి మాట్లాడలేమని నిప్పులు చెరిగారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం లో జరిగిన బహిరంగ సభలో నాలుగో ఏడాది జగనన్న అమ్మ ఒడి పథకం కింద ఆర్ధిక సాయాన్ని సిఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు.
పవన్ ఇటీవల చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. ‘వారిలా మనం రౌడీల్లా మీసాలు మేలేయలేం, తొడలు కొట్టలేం, బూతులూ తిట్టలేము’ అంటూ ఫైర్ అయ్యారు. “వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్ళకోసారి భార్యనూ మార్చలేమని, పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకూ తీసుకు రామేము, వారిలా మనం ఈ పనులు చేయలేం, ఇవన్నీ వారికే పేటెంట్” అని జగన్ విమర్శలు గుప్పించారు.
14ఏళ్ళపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదని, ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, ఆ తరువాత ఆ మేనిఫెస్టోను పక్కన పెట్టడం వారి ట్రాక్ రికార్డు అని, మరోసారి చంద్రబాబు ఈసారి సరికొత్త మేనిఫెస్టోతో వస్తున్నారని, ప్రతి ఇంటికీ కేజీ బంగారం.. బెంజ్ కారు అంటూ మభ్యపెట్టాలని చూస్తున్నారని, మోసం చేయడానికి కూడా హద్దు లేకుండా ప్రయతిస్తున్నారని, జగన్ ఏం చేస్తున్నాడో చూసి దానికంటే కాస్త ఎక్కువగా ఇవ్వాలని అంటున్నారని చెప్పారు.
గత పాలనలో దోచుకొని బొజ్జలు పెంచుకున్నారంటూ టిడిపి, ఎల్లో మీడియాపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు కడుపు మంటతోనే తమపై విమర్శలు చేస్తున్నారన్నారు. చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు అనవద్దు అని గాంధీజీ మూడు కోతులు నీతులు చెబితే… మన రాష్ట్రంలో మాత్రం మంచి వినవద్దు, మంచి కనవద్దు, మంచి అనవద్దు, మంచి చేయవద్దు అనే నాలుగు కోతులున్నాయని వీరిని దుష్ట చతుష్టయం అని పిలుచుకుంటున్నామని అన్నారు.