రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలకు అర్హులు ఎంతమంది ఉన్నా శాచురేషన్ పద్దతిలో అందరికీ అందిస్తున్నామని, ఏ ఒక్కరికీ మిస్ కాకూడదని తాపత్రయ పడే ప్రభుత్వం తమదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కానీ గత ప్రభుత్వం సంక్షేమం ఎలా ఎగ్గొట్టాలి, ఎలా కత్తిరించాలి అని ఆలోచించే వారని, పార్టీలు, కులాల వారీగా ఎంపిక చేసి ఇచ్చేవారని చెప్పారు. గ్రామాలలో ఇంతమందికే కోటా అని పెట్టేవారన్నారు. అయినా ఇన్ని పథకాలు అప్పట్లో లేవని, ఉన్నవాటిలో కూడా కోత విధించే వారని చెప్పారు. వృద్ధులు, వికలాంగులు పెన్షన్ కోసం కాళ్ళరిగేలా తిరగాల్సి వచ్చేదని, జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తే తప్ప పని అయ్యేది కాదన్నారు. ప్రభుత్వాఫీసుల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి కూడా గతంలో చూశామన్నారు. గత ఆరు నెలలుగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందలేని అర్హులకు సిఎం జగన్ వారి అకౌంట్లలో ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా నేడు నిధులు పంపిణీ చేశారు.
గత పాలనకు, తమ పాలనకు ఉన్న తేడా గమనించాలని, వారికి మనసు లేదని తమకు మనసుందని ఇదే ప్రస్ఫుటమైన తేడా అని సిఎం స్పష్టం చేశారు. తమ హయాంలో ఎవరికీ అన్యాయం జరగకుండా, పక్షపాతం లేకుండా సంక్షేమం అందిస్తున్నామన్నారు.