Wednesday, January 22, 2025
HomeTrending NewsYS Jagan: బాబుకు రెండు పక్కలా రెండు పార్టీలు..: సిఎం జగన్

YS Jagan: బాబుకు రెండు పక్కలా రెండు పార్టీలు..: సిఎం జగన్

పవన్ కళ్యాణ్ తన వారాహి వ్యాన్ ను చూసుకొని మురిసిపోతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ళ తర్వాత కూడా చంద్రబాబు కోసమే తాను పుట్టానంటూ చెప్పుకుంటున్న ప్యాకేజ్ స్టార్ ఇప్పుడు.. తాను ఎమ్మెల్యే అవుతానని, కాకుండా ఎవరు ఆపుతారో చూస్తానంటూ మాట్లాడుతున్నారని సిఎం మండిపడ్డారు. గుడివాడలో టిడ్కో ఇళ్ళ పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు.

14ఏళ్ళపాటు సిఎంగా పనిచేసి పేదలకు ఏమాత్రం మంచి చేయని చంద్రబాబు ఇంకో ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారని జగన్ విమర్శించారు. ఎన్నికలకు మరో 10 నెలలు ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజల వద్దకు వచ్చి మోసపూరిత హామీలు ఇస్తున్నారని అన్నారు.  కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిచి 34 సంవత్సరాల తరువాత, 75 ఏళ్ళ వయసులో చంద్రబాబు ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారని, దానికి  తన పర్మిషన్  అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో పేదలకు ఇళ్లు కట్టే ఉద్దేశం చంద్రబాబుకు ఎలాగూ లేదని,  అందుకే తాను సిఎంగా ఉన్న  రోజుల్లో మీ ప్రతి ఇంటికీ ఈ మంచి చేశా కాబట్టి నాకు ఓటేయండని బాబు ఎప్పుడూ అడగలేరన్నారు. కానీ తాము మాత్రం ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోను ఒక ఖురాన్,భగవద్గీత, బైబిల్ గా భావిస్తామని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో  ఇప్పటికే  99 శాతం నెరవేర్చామని, అందుకే  ప్రతి అక్కచెల్లెమ్మల వద్దకు వెళ్లి మీకు మంచి జరిగింది కాబట్టి   అండగా ఉండాలని అడిగే నైతికత తమకు మాత్రమే ఉందన్నారు.

ముఖ్యమంత్రి అయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టకే పరిమితం చేయడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం తర్వాత కూడా ‘రెండు పక్కలా రెండు పార్టీలు ఉంటే తప్ప నిలబడలేని బాబు మనకు ప్రత్యర్థి అట.. 175 నియోజకవర్గాల్లో క్యాండేట్లను పెట్టలేని వ్యక్తి మనకు ప్రత్యర్థి అంట’ అని  వ్యంగ్యంగా అన్నారు. విపక్షాలు చెప్పే అబద్ధాలు నమ్మవద్దని, మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా అనేది ఒక్కటే ప్రామాణికంగా తీసుకోవాలని కోరారు. మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా మారాలని పిలుపు ఇచ్చారు.

అంతకుముందు గుడివాడ మునిసిపాలిటీ మల్లాయపాలెంలో  77 ఎకరాల ఒకే లే అవుట్‌లో పూర్తయిన 8,912 టిడ్కో ఇళ్ల లబ్దిదారుల గృహ ప్రవేశంలో పాల్గొనివారికి నూతనవస్త్రాలు బహూకరించారు. అనంతరం సిఎం జగన్ సభా వేదికకు బయల్దేరారు. ఈ సందర్భంగా ప్రజలు పూలవర్షం కురిపించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్