Sunday, January 19, 2025
HomeTrending NewsTDP: డిప్యుటేషన్ అధికారులకు కీలక శాఖలు: అచ్చెన్న ఆరోపణ

TDP: డిప్యుటేషన్ అధికారులకు కీలక శాఖలు: అచ్చెన్న ఆరోపణ

రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ అధికారుల్లో ఎంతోమంది అనుభవజ్ఞులు, సీనియర్లు  ఉన్నారని కానీ కీలక శాఖలకు ఏ ఒక్కరినీ నియమించడంలేదని ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి 16 మంది అధికారులను డిప్యుటేషన్ మీద రాష్ట్రానికి తీసుకువస్తే వారిలో 10 మంది సిఎం సామాజికవర్గం వారే ఉన్నారని ఈ పదిమందికీ అవినీతి చేయడానికి ఆస్కారం ఉన్న శాఖలు అప్పగించారని ఆరోపించారు. వీరిద్వారా సహజవనరులను దోచుకొని కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారని అన్నారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.

నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బిసిలు అని చెప్పుకునే నైతిక హక్కు సిఎం జగన్ కు గానీ, ఆయన పార్టీకి గానీ లేదని స్పష్టం చేశారు. అవినీతి ఎలా చేయాలనే దానికోసమే  తన అధికారాన్ని జగన్ వాడుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చిన అధికారులు కొద్దికాలం మాత్రమే రాష్ట్రంలో ఉంటారని అలాంటి వారికి కీలక శాఖలు ఎలా ఇస్తారని నిలదీశారు.

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఓ రకంగా ఉంటే సిఎం జగన్ మాత్రం సామాజిక న్యాయం అంటూ మంత్రులను యాత్రలకు పంపడం ఏమిటని విస్మయం వ్యక్తం చేశారు. అర్హత లేని వ్యక్తికి టిటిడి ఈవో బాధ్యతలు అప్పజెప్పారని, ప్రధాని తిరుమల ఆలయానికి వస్తే గతంలో ప్రధాన పూజారిగా ఉన్న వ్యక్తి.. అక్కడ అవినీతి జరుగుతోందని ప్రధానికి ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు.

అధికారంలోకి రాగానే ఇసుక అందుబాటులో లేకుండా చేసి లక్షలాదిమంది భవన నిర్మాణ కార్మికుల కడుపుకొట్టారని,  విజి వెంకటరెడ్డి  అనే అధికారిని తీసుకొచ్చి ఇసుకపై 40 వేల కోట్ల రూపాయలు ఆదాయం లక్ష్యంగా పెట్టారని అచ్చెన్న దుయ్యబట్టారు. మన ఇళ్ళల్లో ఎవరైనా చనిపోతే సంవత్సరం పాటు దేవాలయానికి వెళ్లబోమని, అలాంటిది కొడుకు చనిపోతే ధర్మారెడ్డి 12 రోజుల తరువాత తిరుమల ఆలయానికి వెళ్లి అపవిత్రం చేశారన్నారు. కీలక శాఖలు అప్పగించడానికి ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలకు చెందిన అధికారులు పనికిరారా అని ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తుందని తెలిసిపోయిందని, అందుకే డిప్యుటేషన్ మీద వచ్చిన వారు వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారని, కానీ వారు ఎక్కడ ఉన్నా సరే వెనక్కు తీసుకొచ్చి వారి అవినీతిపై కమిషన్ వేసి శిక్షిస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్