Saturday, January 18, 2025
HomeTrending News26 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: సిఎం జగన్

26 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: సిఎం జగన్

మూడేళ్ళ తమ పాలన ఏ ఒక్క మండలాన్ని కూడా కరవు మండలంగా ప్రకటించాల్సిన అవసరం లేకుండా సాగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిలా వరకూ 26 సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు సమీపంలో మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం ప్రాజెక్టును సిఎం జగన్ జాతికి అంకితం చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ… తన స్నేహితుడు, మంచివాడు, ఎంతో ఆత్మీయుడైన  మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ సంగం బ్యారేజ్ పూర్తి చేయాలని ఎన్నో కలలుకన్నారని, నేడు ఆయన కూడా ఈ కార్యక్రమంలో ఉండి ఉండాల్సిందని, కానీ దురదృష్టవశాత్తూ ఆయన మనకు దూరమయ్యారని భావోద్వేగంతో చెప్పారు.

ఈ బ్యారేజ్ కు గౌతమ్ పేరు పెట్టడం ద్వారా తన స్నేహితుడి పేరు చిరస్థాయిగా నిలుస్తుందన్నారు.  సంగం, నెల్లూరు బ్యారేజ్ లను జాతికి అంకితం చేయడం సంతోషంగా ఉందని, వీటి  ద్వారా 5 లక్షల ఎకరాలకు సాగునీరు స్థిరీకరించవచ్చని, దీని ద్వారా ఆత్మకూరు, కొవ్వూరు, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, కావలి నియోజకవర్గాలకు  మేలు జరుగుతుందన్నారు.  2019 లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీన్ని ప్రాధాన్యతా ప్రాజెక్టుగా గుర్తించి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఓ వైపు కోవిడ్, మరో వైపు పెన్నాకు రెండేళ్ళ పాటు వరదలు వచ్చినా మూడేళ్ళలో మొత్తం 320 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నామన్నారు.

2008లో తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించి పనులు మొదలు పెట్టారని, ఆ పెద్దాయన కొడుకుగా ఆయన  మొదలు పెట్టిన ప్రాజెక్టును నేడు మొదలుపెట్టే అవకాశం తనకు వచ్చిందని, ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు.  గతచంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్ళలో కేవలం 30.80 కోట్ల రూపాయలు మాత్రమె ఖర్చు పెట్టారని వివరించారు.

ఈ సభకు ముందుగా సంగం బ్యారేజ్ వద్ద దివంగత వైఎస్సార్, గౌతమ్ రెడ్డిల విగ్రహాలను సిఎం జగన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, గౌతమ్ రెడ్డి భార్య, కుమార్తె కూడా పాల్గొన్నారు.

Also Read : సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు : సిఎం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్