Sunday, September 8, 2024
HomeTrending Newsఐఎన్‌ఎస్‌ యుద్ధనౌక విశాఖకు గర్వకారణం

ఐఎన్‌ఎస్‌ యుద్ధనౌక విశాఖకు గర్వకారణం

INS Visakha:  విశాఖపట్నం పేరు మీద రూపొందించిన ఐఎన్‌ఎస్‌ విశాఖ యుద్ధనౌక భారతీయ యుద్ధనౌకల్లో గర్వకారణంగా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇది భిన్నమైన సామర్ధ్యం కలిగిన యుద్ధనౌక అన్నారు. భారతీయ నౌకాదళంలో తూర్పుతీర నౌకాదళ కేంద్రం ది సిటీ ఆఫ్‌ డెస్టినీ విశాఖపట్నం పాత్ర చిరస్మరణీయమైనదని జగన్ వెల్లడించారు. విశాఖలోని నేవల్‌ డాక్‌యార్డులోని ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం అంకిత ఫలకాన్ని సిఎం జగన్‌ ఆవిష్కరించారు. ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ మిలాన్‌ –2022  కార్యక్రమంలో సిఎం జగన్, భారతి దంపతులతో పాటు నావికాదళ ఉన్నతాధికారులు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.   మొదట ఐఎన్‌ఎస్‌ వేలా జలాంతర్గామిని ముఖ్యమంత్రి దంపతులు సందర్శించారు. సాయంత్రం ఆర్కే బీచ్‌లోని ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ మిలాన్‌ –2022 వేడుకలను సిఎం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అయన మాట్లాడుతూ విశాఖ చరిత్రలో ఇవాళ గర్వించదగిన రోజని, మిలాన్‌-2022కు ఆతిథ్యం ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. ఈ ఉత్సవంలో 39 దేశాలు ఆన్‌షోర్, ఆఫ్‌షోర్‌ కార్యక్రమాలతో మేరిటైమ్‌లో  భాగస్వామ్యులవుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు.  ఇటీవలే కమిషన్‌ అయిన ఐఎన్‌ఎస్‌ వేలా జలాంతర్గామి దేశీయంగా జలాంతర్గాములను రూపొందించడంలో మన శక్తి సామర్ధ్యాలను నిరూపించిందని కొనియాడారు.

“భారత నౌకాదళం ఆధ్వర్యంలో 39 దేశాలతో కలిపి మిలాన్‌ పేరుతో జరిగే నౌకాదళ విన్యాసాలకు మన విశాఖ సాగర తీరం విడిది అయింది. ఇది ఒక అరుదైన యుద్ధనౌకా విన్యాసాల పండుగ. ఈ పండుగకు దాదాపుగా 39 దేశాలను ఆహ్వానించడం జరిగింది. భారత నౌకాదళానికి, ప్రత్యేకించి ఈస్ట్రర్న్‌ నేవల్‌ కమాండ్‌కు అనేక దేశాల నుంచి వచ్చి, ఈ విన్యాసాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు” అని సిఎం తన సందేశంలో పేర్కొన్నారు.

ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం అనే యుద్ధనౌకను కొద్ది కాలం క్రితమే నౌకాదళంలోకి తీసుకువచ్చారని, ఈ నౌకపైభాగం మీద కూడా ప్రత్యేకించి మన విశాఖపట్నంలోని డాల్ఫిన్‌ లైట్‌ హౌస్‌ను, ఇక్కడ సహజంగా, ప్రకృతి ప్రసాదంగా ఏర్పడిన డాల్ఫినోస్‌ను, మన రాష్ట్ర మృగం కృష్ణజింకను చిత్రీకరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు సిఎం. కొత్తగా నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్‌ వేలా జలాంతర్గామి మన విశాఖ తీరంలోకి రావడంతో ఈ ప్రాంత రక్షణలో మరో అధ్యాయం ప్రారంభమైందన్నారు. ఇలాంటి నౌకలతో జరిగే విన్యాసాలు విశాఖ ప్రజలతో ఎంతో ఉత్సాహంతో పాటు మన దేశ రక్షణ కోసం నిరంతరం పాటుపడుతున్న సైన్యం మీద మరింత నమ్మకం పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం, ఇండియన్‌ నేవీ కలిసి సంయుక్తంగా ఈ తరహా కార్యక్రమానికి విశాఖపట్నం కేంద్రంగా అతిధ్యం ఇవ్వడం ఇదే తొలిసారి అని భవిష్యత్తులో కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తామని సిఎం జగన్ హామీ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్