Nadu-Nedu: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులు ప్రపంచంతో పోటీ పడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. పెద్ద పెద్ద స్కూళ్లలో పిల్లలకు ఏమాత్రం తీసిపోకూడదని సూచించారు. నాడు–నేడుతో స్కూళ్ల రూపురేఖల్లో సమూల మార్పులు తీసుకువచ్చామని చెప్పారు. వైయస్సార్ జిల్లా వేంపల్లెలో మనబడి నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా పునర్‌నిర్మించిన జిల్లా పరిషత్ హైస్కూల్ భవనాలను ప్రారంభించారు. అనంతరం విద్యార్ధులను ఉద్దేశించి జగన్ మాట్లాడారు.
“ఇంతకముందు స్కూళ్ల పరిస్థితి ఎలా ఉంది, ఈ రోజు పరిస్థితి ఎలా మారిందో మీరు చూడవచ్చు. ఈ రెండు ఫోటోలు చూస్తే…
( గతంలో స్కూల్ – పునర్ నిర్మాణం తర్వాత ఇప్పటి స్కూల్ ఫోటో చూపిస్తూ) ఇంతకముందు నాడు, ఈ రోజు నేడు. ఇదే స్కూల్ పరిస్థితిలో ఏ రకంగా మార్పు జరిగిందనేది.. ఎంత గొప్పగా, చక్కగా కనిపిస్తుందో చూడవచ్చు. ఇంత మంచి కార్యక్రమాలు చేయగలిగే అవకాశం దేవుడు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. అందరూ బాగా చదివాలి. ఈ రోజు మనం వేసే అడుగులు మంచి స్కూల్స్ నుంచి వస్తున్న పెద్ద, పెద్ద పిల్లలు ఏ మాదిరిగా చదువుతారో, మాట్లాడుతారో అదే మాదిరిగా గొప్పగా చదవాలి. గొప్పగా ఇంగ్లిషు మాట్లాడాలి. ప్రపంచంతో పోటీ పడే పరిస్థితిలోకి మీరు అందరూ వెళ్లాలని మనసారా కోరుకుంటున్నాను. మీకు అందరికీ ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్” అంటూ విద్యార్ధులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైయస్.అవినాష్‌రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.