Sunday, January 19, 2025
HomeTrending Newsఓర్వలేక పోతున్నారు: సిఎం జగన్ విమర్శ

ఓర్వలేక పోతున్నారు: సిఎం జగన్ విమర్శ

Pension hike: గతంలో మంచి చేసిన చరిత్ర లేని నాయకులు పేద ప్రజలకు తాము మంచి చేస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. తమ పిల్లల్లాగే పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలని ఏనాడూ వారు అనుకోలేదని, తాము ఆ పని చేస్తుంటే  ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకుంటున్నారని, పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తుంటే దానిపై కూడా కోర్టులకు వెళ్లి స్టే లు తెచ్చే అధ్వాన్నమైన స్థాయికి చేరారని విమర్శించారు. రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తుంటే ‘డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్’ వస్తుందంటూ కోర్టులకు వెళ్ళారని సిఎం గుర్తు చేశారు. వైఎస్సార్ పెన్షన్ కానుకను 2250 నుంచి 2500 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి అమల్లోకి వస్తున్న ఈ పెంపును గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పెదనందిపాడు నుంచి లాంచనంగా సిఎం జగన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో జగన్ మాట్లాడుతూ ఈరోజు కేవలం క్యాలండర్లో డేట్ మాత్రమే మారడంలేదని 62 లక్షల మంది జీవితాల్లో చిరునవ్వులు రాబోతున్నాయని చెప్పారు. దేశంలో అత్యధిక పెన్షన్లు, ఎక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనేనని స్పష్టం చేశారు.  గత ప్రభుత్వ హయాంలో కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఇచ్చేవారని, ఇప్పుడు తాము 2250, నేటి నుంచి 2500 రూపాయలు ఇస్తున్నామని, గతంలో 39 లక్షల మందికే పెన్షన్ ఇచ్చేవారని, ఇప్పుడు 62 లక్షల మందికి  ఇస్తున్నామని వెల్లడించారు. నెలకు పెన్షన్లపై రూ 1570 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. పెన్షన్ల పంపిణీలో కోతలు, కోటాలు లేవని, ఎంతమందికి ఎగ్గొట్టాలానే ఆలోచన అసలే లేదని వ్యాఖ్యానించారు. పెన్షన్లు పెంచుకుంటూ పోతుంటే కొందరు తమపై విమర్శలు చేస్తున్నారని, మంచి చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని జగన్ దుయ్యబట్టారు.

పేదలకు అందుబాటు రేటుకే వినోదాన్ని అందించాలని సినిమా టికెట్ ధరలను నిర్ణయిస్తే దానిపై కూడా రాకరాకుగా మాట్లాడుతున్నారని జగన్ విస్మయం వ్యక్తం చేశారు. తాము చేస్తున్న మంచి పనులకు అడ్డుపడుతున్న వీరంతా పేదల వ్యతిరేకులు కాదా అని జగన్ ప్రశ్నించారు.

స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను ప్రస్తావించి వాటిని మంజూరు చేయాలని కోరగా సిఎం సభా వేదికపై వాటిని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెరుకువాడ రంగనాథ రాజు, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎంపీ మోపిదేవి వెంకట రమణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్