ఎంతో మంది త్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కుపై సిఎం జగన్ ఎందుకు నోరు మెదపడంలేదని మాజీ మంత్రి, టిడిపి నేత ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఎందుకు ప్రయత్నించడంలేదని అడిగారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపలేకపోతే జగన్ తన సిఎం పదవికి రాజీనామా చేయాలని ప్రత్తిపాటి డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కును కాపాడుకోవడంలో అధికార పార్టీ ఓ స్పష్టమైన వైఖరి తీసుకోవాలని కోరారు. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి కెసిఆర్ సింగరేణి సంస్థ ద్వారా విశాఖ ఉక్కును కొనేందుకు ప్రయత్నిస్తుంటే ఇక్కడి సిఎం జగన్ ఏం చేస్తున్నారని నిలదీశారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో బండారు సత్యనారాయణ మూర్తితో కలిసి మీడియాతో మాట్లాడారు.
మార్గదర్శి పై సిఎం జగన్ అక్రమ కేసులు పెట్టడం సరికాదని, దాదాపు 2 లక్షల మంది చందాదారులు, 3 వేల మంది ఉద్యోగులు, 3 వేల కోట్ల రూపాయల నిధులతో ఉన్న ఆ సంస్థను వేధించడం మానుకోవాలని బండారు ప్రభుత్వానికి హితవు పలికారు. ఈ వయసులో అలాంటి పెద్ద మనిషి రామోజీ రావును ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. తానూ ఆ చిట్ ఫండ్ కంపెనీ చందాదారుడినేనని ఎన్నడూ ఆ కంపెనీ మోసం చేయలేదని, ప్రతిదీ పారదర్శకంగా, చెక్కుల రూపంలోనే అందిస్తారని, అలాంటిది దీనిపై దొంగ కేసులు పెట్టడం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.