చంద్రబాబు తన పదవీ కాలంలో మొత్తం 54 ప్రభుత్వ, సహకారరంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడమో, అమ్మడమో చేశారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. 2019లో మరోసారి బాబు సిఎం అయి ఉంటే ఆర్టీసీ, ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ స్కూళ్ళను కూడా ఎవరికో ఒకరికి అమ్మేసి ఉండేవారని మండిపడ్డారు. తన స్వార్ధం కోసం పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన బాబు, ఆఖరికి తన స్వలాభం కోసం సొంత జిల్లాలోని చిత్తూరు డెయిరీని కూడా మూసేసి రైతులను నట్టేట ముంచారని ఆరోపించారు. చిత్తూరు డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను పూర్తిగా తీర్చి, దానికి మరలా జీవం పోస్తూ అమూల్ సంస్ధతో ఒప్పందం చేసుకుని, అమూల్ ద్వారా రూ.385 కోట్ల పెట్టబడితో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. అనంతరం చిత్తూరు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం తాము చిత్తూరు విజయ డెయిరీని పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. బాబు కుట్రపూరితంగా కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఏ సంస్థను మూసి రైతులను మోసం చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడాన్ని ఓ గొప్పగా బాబు భావిస్తారని, Privatization- A Success story in Andhra Praesh అని ఓ పుస్తకం కూడా రాశారని గుర్తు చేశారు.
చక్రాలు లేని సైకిల్ ఎక్కలేని నాయకుడు ఒకరైతే, ఎవరైనా తైలం పోస్తే తప్ప గ్లాసు నిండని నాయకుడు మరొకరు అంటూ బాబు, పవన్ లపై విరుచుకుపడ్డారు. ఒకరు వెన్నుపోటు వీరుడు, మరొకరు ప్యాకేజీ సూర్యుడు అని అభివర్ణించారు. దత్తపుత్రుడిని తాను ఏ ఎన్నికల్లో ఎందుకు, ఎప్పుడు, ఎలా జనం మీదికి వదులుతారో కూడా ఎవరికీ తెలియదనేది బాబు నమ్మకమని ఎదురుదాడి చేశారు. 2014 నుంచి 19వరకూ ఈ ఇద్దరూ అన్ని సామాజిక వర్గాలనూ, అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేసి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఈ ఇద్దరు నేతలకూ సామాజిక న్యాయం తెలియదని, అన్యాయం బాగా తెలుసని జగన్ అన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. వీరిద్దరూ నాన్ రెసిడెంట్ నాయకులని, వారు రాష్ట్రంలోనే ఉండడం లేదని, వీరికోసం హైదరాబాద్ వెళ్ళాల్సిందేనని ఎద్దేవా చేశారు.