ఆగస్ట్ లో ముందస్తు ఎన్నికకలకు వెళ్లేందుకు సిఎం జగన్ సన్నాహాలు చేస్తున్నారని, మార్చి తరువాత నెల రోజుల్లో అసెంబ్లీ ని రద్దు చేయబోతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీకి 160 స్థానాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టిడిపి స్ట్రాటజీ కమిటీ సమావేశం తాడేపల్లిలో జరిగింది, అనతరం ఎమ్మెల్యే రామాయాయుడితో కలిసి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. సిఎం జగన్ కోర్టు తీర్పులను కూడా లెక్కచేయకుండా వచ్చే నెలలో విశాఖకు మకాం మార్చి అదే అజెండాతో ఎన్నికలకు వెళ్ళినా ఆశ్చర్యం లేదన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల్లో 75 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇంకా సమయం గడిచే కొద్దీ ఈ సంఖ్య పెరగబోతోందని, ఇది కూడా జగన్ ముందస్తుకు ఓ కారణమని అచ్చెన్న విశ్లేషించారు.
1983లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటికంటే ఇప్పుడు తమ పార్టీ నేతలు చంద్రబాబు, లోకేష్ ల పర్యటనకు ప్రజలు వెల్లువలా వస్తున్నారని, లోకేష్ యువ గళం యాత్రలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని తమ సంఘీభావం ప్రకటిస్తున్నారని చెప్పారు. జగన్ ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందని, కేంద్రమే అధికారికంగా ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పును బైటపెట్టిందని, దొంగతనంగా మరో ఐదు లక్షల కోట్లు చేశారని అచ్చెన్నాయుడు వివరించారు.
జగన్ ఎప్పుడు ఎన్నికలకు వెళ్ళినా టిడిపి కేడర్ ను సిద్ధం చేస్తున్నామని, ఈ విషయమై స్ట్రాటజీ కమిటీలో చర్చించామని తెలిపారు. రాష్ట్రాన్ని ఐదు జోన్ లుగా విభజించి ఐదు సమావేశాలు పెడుతున్నామని, ఒక్కో నియోజకవర్గం నుంచి 60-70 మందిని ఎంపిక చేసి, 35 అసెంబ్లీ లు ఒక జోన్ గా ఏర్పాటు చేసి ఈ మీటింగ్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈనెల 21,22,23,24,25 తేదీల్లో ఈ సమావేశాలు ఉంటాయన్నారు.