Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

CM Fire: తమ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు టిడిపికి అనుకూలంగా ఉండే కొందరు ఉద్దేశపూర్వకంగా పదవ తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ కు పాల్పడ్డారని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. నారాయణ, చైతన్య విద్యా సంస్థల నుంచే ఈ లీక్ జరిగిందని, వారు వాట్సాప్ ద్వారా ఈ పేపర్ బైటకు పంపారని చెప్పారు.  టిడిపి హయాంలో మంత్రిగా పనిచేసిన నారాయణ సంస్థల నుంచే మొదటగా ఈ లీక్ జరిగిందన్నారు.  ఈరోజు విద్యా దీవెన కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి, తాము చేస్తున్న మంచి వెలుగులోకి రాకుండా ఉండడం కోసమే ఈ తరహా కుట్రలకు పాల్పడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఈ సంఘటన ద్వారా తమ ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లారని వ్యాఖ్యానించారు. రెండు నారాయణ, మూడు చైతన్య సంస్థలు ఈ  లీక్ వెనుక సూత్రధారులని చెప్పారు. ఈ లీక్ ఒక వ్యవస్థను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారని, ఈ వ్యవహారం దొంగే ‘దొంగా  దొంగా’ అని అరిచినట్లుందని దుయ్యబట్టారు. తిరుపతిలో జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొన్న సిఎం జగన్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.

అక్క చెల్లెమ్మలకు తాము చేస్తున్న మంచికి పరదా కట్టేందుకు అత్యాచారాలంటూ టిడిపి నేతలు కొత్తగా ప్రచారం మొదలు పెట్టారనీ,  రాష్ట్రంలో జరిగిన అత్యాచార ఘటనలు దురదృష్టకరమని, అయితే ఈ సంఘటనలపై తెలుగుదేశం రాజకీయం చేయడం దుర్మార్గమని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణ కోసం దేశంలోని ఎక్కడా లేని విధంగా దిశ చట్టం తీసుకొచ్చామన్నారు. ఇటీవల జరిగిన అత్యాచార ఘటనలలో నిందితులు ఆ పార్టీకి చెందిన వారేనని జగన్  చెప్పారు.  గత ప్రభుత్వ హయాంలో జరిగిన దానికి, ఇప్పుడు తమ ప్రభుత్వం చేస్తున్న మంచికి తేడా గమనించాలని సిఎం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నో  పథకాలతో పేదలను తాము ఆదుకుంటున్నామని, తాము చేస్తున్న మంచితో జీర్ణించుకోలేని కొందరు దుష్టచతుష్టయంగా మారి కడుపు మంటతో రగిలిపోతున్నారని ధ్వజమెత్తారు.

‘వారు గుడులు ధ్వంసం చేస్తే మనం గుడులు కట్టాం
వారు విగ్రహాలను విరిచేస్తే మనం విగ్రహాలను పెట్టించాం
వారు రథాలు తగలబెడితేమనం రథాలు మళ్ళీ నిర్మించాం
వారు మన రైతును కుంగదీస్తే మన రైతును మళ్ళీ నిలబెడుతున్నాం
వారు మన పల్లెలను దెబ్బ తీస్తే ప్రతి పల్లెలోకి కూడా ప్రభుత్వ సేవలను విలేజ్, వార్డు సెక్రటేరియట్లు తీసుకొని పోయాం
వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చాం, పాలనను పూర్తిగా డీ సెంట్రలైజేషన్ చేసి గడప వద్దకే పరిపాలన తీసుకొచ్చాం
వారు మన బడులను, ఆస్పత్రులను శిథిలావస్థకు తీసుకొస్తే మనం వాటిని నాడు-నేడుతో వాటిని నిలబెడుతున్నాం

వారు మన పేద పిల్లలు ఎదగకూడదు అని చెప్పి, తెలుగు మీడియం మాత్రమే చదివించాలని చూస్తే, ఎన్ని ఆటంకాలు కలిగించినా ఇంగ్లీష్ మీడియం అందించేందుకు ఒక గొప్ప విప్లవ పోరాటం చేస్తున్నాం

ఎన్నికల వేళ వారి మాటలు కోటలు దాటుతాయని, కానీ అధికారంలోకి వచ్చిన తరువాత వారి హామీలు గడప కూడా దాటవని దుయ్యబట్టారు.

“దేవుడా! రక్షించు మా రాష్ట్రాన్ని… ఈ ఎల్లో మీడియా నుంచి, ఈ ఎల్లో పార్టీ నుంచి…..

రెండు నాల్కల చాచి బుసలు కొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుంచి… దూర్తుల నుంచి, దుష్ట చతుష్టయం నుంచి రక్షించు దేవా” అని వెంకటేశ్వర స్వామిని ప్రార్ధిస్తున్నట్లు సిఎం జగన్ చెప్పారు.

Also Read : అసూయకు మందులేదు: సిఎం జగన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com