Saturday, January 18, 2025
HomeTrending Newsమద్దతు ధర బాద్యత మనదే: సిఎం స్పష్టం

మద్దతు ధర బాద్యత మనదే: సిఎం స్పష్టం

Responsibility: రైతుల పంటను కొనుగోలు చేయడంతో పాటు ఎంఎస్‌పీ కల్పించాల్సిన బాధ్యత కూడా మనదేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులతో వ్యాఖ్యానించారు. పాలకులుగా, అధికారులుగా మనం గొంతులేని వారిపక్షాన నిలవాలని, వారి పక్షం నుంచి మనం ఆలోచన చేయాలని, రైతుల విషయంలో కూడా అంతేనని స్పష్టం చేశారు. మద్దతు ధర అందించే విషయంలో కచ్చితంగా రైతుల పక్షాన మనం నిలవాలని తేల్చి చెప్పారు. ఖరీఫ్‌ సీజన్ నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖపై సమీక్ష నిర్వహించారు. ఇ– క్రాపింగ్, ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోళ్లు అంశాల అధికారులకు పలు సూచనలు చేశారు. రైతు పండించిన పంటను కచ్చితంగా ఇ–క్రాపింగ్‌ చేయాలని, ఈ డేటా ఆధారంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఇతరత్రా ఏ కష్టం వచ్చినా రైతును ఆదుకునేందుకు వీలు ఉంటుందని సిఎం అభిప్రాయపడ్డారు.

సమీక్ష సందర్భంగా సిఎం మాట్లాడిన ముఖ్యాంశాలు

  • ఇ–క్రాప్‌ ప్రక్రియను మరింత బలోపేతం చేయాలి
  •  ఇ–క్రాప్‌ చేసిన తర్వాత డిజిటల్‌ రశీదుతోపాటు, ఫిజికల్‌ రశీదుకూడా ఇవ్వాలి
  • డిజిటల్‌ రశీదును నేరుగా రైతు సెల్‌ఫోన్‌కు పంపాలి
  • ఒకవేళ తనకు నష్టం వస్తే.. ఆ రశీదు ఆధారంగా రైతులు ప్రశ్నించగలిగే హక్కు వారికి వస్తుంది
  • దీనికి సంబంధించిన ఎస్‌ఓపీని బలోపేతం చేయాలి, వీఆర్వో, సర్వే అసిస్టెంట్, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ల జాయింట్‌ అజమాయిషీ బాధ్యతను అప్పగించాలి
  • ఆ గ్రామంలో సాగుచేస్తున్న భూములు, సంబంధిత రైతుల వివరాలతో కూడిన మాస్టర్‌ రిజిస్టర్‌ను వీరికి అందుబాటులో ఉంచాలి
  • జియో ట్యాగింగ్, ఫొటో గ్రాఫ్స్‌ ఇ–క్రాప్‌లో లోడ్‌ చేయాలి
  • జూన్‌ 15 నుంచి ఇ– క్రాపింగ్‌ మొదలుపెట్టి, ఆగస్టు చివరినాటి పూర్తిచేయాలి
  • సెప్టెంబరు మొదటివారంలో సామాజిక తనిఖీచేపట్టాలి, జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలి
  • ఉన్నతాధికారుల స్థాయిలో ప్రతి 15 రోజులకోసారి ఇ–క్రాపింగ్‌పై సమీక్ష, పర్యవేక్షణ చేయాలి
  • మండలస్థాయి, జిల్లా స్థాయిల్లో అధికారులు ఇ–క్రాపింగ్‌ జరుగుతున్న తీరును తనిఖీచేయాలి
  • ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర తీసివేయాలి, ఆర్బీకేల ద్వారానే ధాన్యం కొనుగోళ్లు జరగాలి

  • ధాన్యం విక్రయం కోసం రైతులు మిల్లర్ల దగ్గరకు వెళ్లే పరిస్థితులు ఉండకూడదు
  • ధాన్యం కొనుగోలు బాధ్యత, తర్వాత వారికి డబ్బు చెల్లించే బాధ్యత కూడా పౌరసరఫరాల శాఖదే
  • రైతు నుంచి కొనుగోలు చేసిన తర్వాత… ఆ ధాన్యాన్ని వేరే వే–బ్రిడ్జి వద్ద తూకం వేయించి రశీదును రైతుకు ఇవ్వాలి
  • దీనివల్ల రైతుకు ఎంఎస్‌పీ  లభిస్తుంది, రావాల్సిన ఎంఎస్‌పీలో ఒక్క రూపాయికూడా తగ్గకుండా రైతుకు రావాలి

సమీక్షా సమావేశానికి వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏపీ అగ్రిమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎం వి యస్‌ నాగిరెడ్డి,  సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య,  వ్యవసాయశాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి,  మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్యకార్యదర్శి వై మధుసూధన్‌ రెడ్డి, సివిల్‌ సఫ్లైస్‌ కమిషనర్‌ ఎం గిరిజాశంకర్, వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ సి హరి కిరణ్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్