Saturday, January 18, 2025
HomeTrending Newsఇది పేదవాడికి-పెత్తందార్లకు మధ్య యుద్ధం: జగన్

ఇది పేదవాడికి-పెత్తందార్లకు మధ్య యుద్ధం: జగన్

మూడు రాజధానుల వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని తాము చెబుతుంటే, మూడు పెళ్ళిళ్ళ వల్లే మేలు జరుగుతుంది, మీరు కూడా చేసుకోండి అంటూ  కొందరు నాయకులు చెబుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నాయకులుగా ఉన్నవారు ఇలా మాట్లాడడం ఏమిటని… ఇలాంటివారా మన నాయకులు అనేది అందరూ ఆలోచించాలన్నారు. వీరు మనకు దశ, దిశా చూపగలరా అని ప్రశ్నించారు. ఎవ్వరికీ అన్యాయం చేయకుండా, ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా  మూడు రాజధానులతో అందరికీ మంచి చేయాలని సంకల్పించామని,  కానీ ఎవరికీ మంచి చేసిన చరిత్ర లేనివారు, వెన్నుపోటు దారులు అందరూ తమపై పోరాటానికి ఏకమవుతున్నారని ధ్వజమెత్తారు. ఒక్క జగన్ ను కొట్టడానికి ఇంతమంది కలుస్తున్నారన్నారు. అవనిగడ్డలో నిషేధిత 22(ఏ)1 కింద ఉన్న భూముల సమస్యని పరిష్కరించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా రైతులకు క్లియరెన్స్‌ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన బహిరంగ సభలో ఇటీవలి రాజకీయ పరిణామాలపై సిఎం జగన్ స్పందించారు.

దత్తపుత్రుడితో దత్త తండ్రి ఏం మాట్లాడిస్తున్నారో  మొన్ననే అందరం చూశామని,.. నాయకులుగా చెప్పుకుంటున్నవారు మీడియా ముందు… వీధి రౌడీలు కూడా తిట్టలేని భాషతో… చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి  సిఎం జగన్ మండిపడ్డారు.  ఇది మంచికి-మోసానికి, పేదవాడికి-పెత్తందార్లకు, సామాజిక న్యాయానికి-సమాజాన్ని ముక్కలు చెక్కలుగా చేయాలనుకునేవారికి మధ్య జరుగుతున్న యుద్ధమని జగన్  పేర్కొన్నారు. ఇక పోరాటం… వివక్ష, లంచాలు లేకుండా సంక్షేమం ఇచ్చిన మన ప్రభుత్వానికి, ప్రజలకు ఏనాడూ మంచి చేయని పచ్చరంగు పెత్తందారుల కూటమికి మధ్య పోరాటం సాగుతుందని, మరో 19 నెలల్లో వచ్చే ఎన్నికల వరకూ ప్రతిరోజూ ఈ పోరాటం సాగుతుందని వ్యాఖ్యానించారు. ఈ కుట్రలు, కుతంత్రాలను నమ్మవద్దని, మీకు మీ ఇంతో మంచి జరిగిందా లేదా అనేది మాత్రమే ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

తమ పరిపాలనలో జరిగిన మంచి ఏమిటి, గత పాలనలో జరిగిన చెడు ఏమిటో ఆలోచించాలని ప్రజలను కోరారు.  గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు గతంలో తన తండ్రి దివంగత నేత వైఎస్ హయాంలో ఇస్తే ఇప్పుడు తమ ప్రభుత్వంలో ఇస్తున్నామన్నారు.  రైతులనుంచి భూములు ఎలా దోచుకోవాలని వారు ఆలోచిస్తే, వారికి ఆ భూములు ఎలా తిరిగి ఇవ్వాలనేది తాము అలోచిస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలను 98శాతం  నెరవేర్చిన ప్రభుత్వం తమదైతే, అసలు మేనిఫెస్టోను కనబడనీయకుండా చేసిన చరిత్ర వారిదేనన్నారు.

తనకు వారిలాగా మీడియా, దత్తపుత్రుడు తోడుగా లేకపోవచ్చని, కానీ దేవుడి దయతో పాటు మన పాలనలో మంచి జరిగిన ప్రతి కుటుంబంలోని ప్రతి అక్కా, చెల్లెమ్మ, అన్న, తమ్ముడు, తల్లి, అవ్వ, తాత… వీరంతా తోడుగా నిలబదతారన్న నమ్మకం ఉందని జగన్ ధీమా వ్యక్తం చేశారు.

Also Readకలిసి పోరాడదాం: బాబు-పవన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్