Raithu Bharosa: వైఎస్సార్ రైతు భరోసా సాయాన్ని ఈనెల 16న అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద నాలుగో ఏడాది తొలి విడత సాయాన్ని రైతుల అకౌట్లలో జమ చేయనుంది. 48.77 లక్షల మందిని అర్హులుగా గుర్తించింది. వీరిలో 47.86 లక్షల మంది భూ యజమానులు కాగా..91వేల మంది అటవీ భూమి సాగుదారులు ఉన్నారు. వీరందరికీ కలిపి 3,657.87 కోట్లరూపాయలు తొలి విడత సాయంగా అందించనుంది. వైఎస్సార్ రైతు భరోసా-పిఎం కిసాన్ యోజన ద్వారా ఏటా మూడు విడతల్లో రూ.13,500 సాయం ప్రభుత్వం అందిస్తూ వస్తోంది. మొదటి విడతగా ఖరీఫ్ సీజన్ మొదలయ్యే మే నెలలో రూ.7,500, రెండో విడతగా అక్టోబర్‌లో రూ.4వేలు, మూడో విడతగా జనవరిలో రూ.2వేలు అందిస్తోంది.
వ్యవసాయశాఖపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ నేడు సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా, రైతులకు పంట బీమా చెల్లింపు, సబ్సిడీపై రైతులకు వ్యవసాయ ఉపకరణాల పంపిణీ, ఖరీఫ్ సన్నద్ధత, కిసాన్ డ్రోన్లు, మిల్లెట్ పాలసీ, పంట మార్పిడి తదితర అంశాలపై సీఎం అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
జూన్ 15 లోగా రైతులకు పంట బీమా పరిహారం పంపిణీ చేయాలని, అదే నెలలో 3వేల ట్రాక్టర్లు సహా, 4014 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లలో వ్యవసాయ ఉపకరణాలు పంపిణీ, 402 హార్వెస్టర్లను కూడా కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లకు ఇవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా కేంద్రాలు ఎఫ్‌ఏఓ చాంఫియన్ అవార్డుకు ఎంపికైన నేపధ్యంలో వ్యవసాయ శాఖ అధికారులను సిఎం జగన్ అభినందించారు. తోటబడి కార్యక్రమంలో మామిడి, అరటిపై కరదీపిక విడుదల చేసిన సీఎం, బ్యాంబు ట్రీ (వెదురు) బై ప్రొడక్ట్స్‌ను పరిశీలించారు. రైతు భరోసా కంటే ముందే, మే 11న మత్స్యకార భరోసా అందించాలని కూడా ప్రభుత్వం ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
వ్యవసాయ ఉత్పత్తుల్లో పెరుగుదలను, వ్యవసాయ రంగ పరిస్థితులను అధికారులు సిఎంకు వివరించారు. 2021 ఖరీఫ్‌లో 90.77 లక్షల ఎకరాల్లో…. రబీ 2021–22లో 54.54 లక్షల ఎకరాల్లో పంటసాగు అయ్యిందని వివరించారు. 2020-21లో ఆహార ఉత్పత్తులు 165.07 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 2021–22లో 171.7 లక్షల మెట్రిక్ టన్నులు అని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే.. ఈఏడాది 4శాతం అధికంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, పుడ్ ప్రాససింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఏపీ అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ ఎం వి యస్ నాగిరెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి వై మధుసూధన్‌రెడ్డి, వ్యవసాయశాఖ కమిషనర్ సి హరికిరణ్, ఉద్యానవనశాఖ కమిషనర్ ఎస్ ఎస్ శ్రీధర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read : కేన్సర్ ఆస్పత్రిని ప్రారంభించిన సిఎం