Sunday, September 22, 2024
HomeTrending Newsనేడు తల్లి బిడ్డ ఎక్స్‌ ప్రెస్‌ వాహనాల ప్రారంభం

నేడు తల్లి బిడ్డ ఎక్స్‌ ప్రెస్‌ వాహనాల ప్రారంభం

Vehicles Launch: గర్భిణీ స్త్రీలను ఆస్పత్రులకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లి బిడ్డ ఎక్స్‌ ప్రెస్‌ వాహనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద జెండా ఊపి ప్రారంభించనున్నారు. అధునాతన వసతులతో కూడిన 500 ఎయిర్‌ కండిషన్డ్‌ వాహనాలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి.

నెలలు నిండి కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరే అక్కచెల్లెమ్మలను, వారి ఇంటి నుండి 108 వాహనంలో ఉచితంగా తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్చి నాణ్యమైన వైద్యసేవలు, డబ్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా అందిస్తోంది ప్రభుత్వం. వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా ద్వారా తల్లికి విశ్రాంతి సమయంలో అవసరాల కోసం రూ. 5000 ఆర్ధిక సాయాన్ని కూడా అందిస్తోంది.

డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల ద్వారా ఏడాదికి సగటున 4 లక్షల మందికి సేవలు అందనున్నాయి. తల్లులకు సహాయం అందించేందుకు వీలుగా కేంద్రీకృత కాల్‌ సెంటర్‌, ప్రసవానంతరం తల్లుల సౌకర్యార్ధం నర్సులు, డ్రైవర్ల సమన్వయం కోసం డా.వైఎస్సార్‌ తల్లి బిడ్డ ఎక్స్‌ ప్రెస్‌ యాప్‌ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చింది.

నేడు అత్యాధునిక వసతులతో కూడిన పూర్తి ఎయిర్‌ కండిషన్డ్‌ వాహనంలో ప్రత్యేకంగా అన్ని వసతులతో వారిని బాగా చూసుకుంటూ ఒక తల్లి, బిడ్డ, వారి సహాయకులు ఇద్దరు మాత్రమే సౌకర్యవంతంగా ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తోంది ప్రభుత్వం.

తల్లుల రక్షణ, భద్రతకు భరోసా కల్పిస్తూ అన్ని వాహనాలు జీపీఎస్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానం.  అక్కచెల్లెమ్మలు వాహనం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఏ వాహనం ఎక్కడ ఉందో రియల్‌ టైంలో తెలుసుకునే అవకాశం కూడా ఉంది. డా.వైఎస్సార్‌ తల్లి బిడ్డ ఎక్స్‌ ప్రెస్‌ సేవల కోసం టోల్‌ఫ్రీ నెంబర్‌ 102 ను కూడా ఏర్పాటు చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్