Sunday, November 24, 2024
HomeTrending News'ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్' కు నేడే శ్రీకారం

‘ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్’ కు నేడే శ్రీకారం

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ మరో వినూత్న పథకానికి శ్రీకారం చుడుతోంది. ప్రివెంటివ్‌ కేర్‌ లో భాగంగా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. వైద్యం కోసం డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా  ప్రజల ముంగిట్లోకే ఉచిత వైద్యం అందించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

అందరికీ ఆధునిక, నాణ్యమైన వైద్యం  ఉచితంగా వారి చెంతనే అందించడంతో పాటు మంచానికే పరిమితమైన రోగులకు సైతం వారి గ్రామంలోనే, వారి గడప వద్దనే అవసరమైన వైద్యం అందజేయాలన్న ఉద్దేశంతోనే ఈ  ఫ్యామిలీ డాక్టర్‌ విధానానికి శ్రీకారం చుట్టామని ప్రభుత్వం వెల్లడించింది.

ప్రతి మండలానికి కనీసం రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు, ఒక 104 వాహనంతో అనుసంధానం చేస్తూ ఒక డాక్టర్‌ పీహెచ్‌సీలో ఉంటే మరో డాక్టర్‌ ప్రతిరోజూ తనకు కేటాయించిన గ్రామాల్లోని వైఎస్సార్‌ విలేజ్‌ క్లీనిక్, పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి వైద్య సేవలు అందించనున్నారు.

వైద్యుడు తనకు కేటాయించిన అదే గ్రామాన్ని నెలలో కనీసం రెండు సార్లు సందర్శించి వైద్యసేవలు అందిస్తారని, దీని ద్వారా ఆ పేషెంట్‌కు డాక్టర్‌కు మధ్య బాండింగ్‌ ఏర్పడుతుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలియజేసింది. ఆ డాక్టర్‌కు ఆ పేషెంట్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ మీద పూర్తి అవగాహన ఉండడంతో మెరుగైన చికిత్స అందించడం సులభతరం అవుతుందిని పేర్కొంది. తద్వారా వైద్యునికి ఆ గ్రామంపై పూర్తి అవగాహన, ఆ గ్రామంలోని ప్రతి వ్యక్తినీ పేరు పేరునా గుర్తించే అవకాశం ఉంటుందని వెల్లడించింది.

దీనికోసం ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చిన 936 మొబైల్‌ మెడికల్‌ యూనిట్లను (104 అంబులెన్స్‌ లు) నాడు నేడులో భాగంగా ఏర్పాటుచేసిన 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లీనిక్‌లతో అనుసంధానించడం ద్వారా ఫ్యామిలీ డాక్టర్‌ విలేజ్‌ క్లీనిక్‌లోని సీహెచ్‌ఓ, ఏఎన్‌ఎమ్, ఆశా కార్యకర్తల సహకారంతో వైద్యసేవలు అందిస్తారని వివరించింది.

ప్రతి విలేజ్‌ క్లీనిక్‌లో 14 రకాల టెస్టులు, 105 రకాల మందులు అందుబాటు, మరింత మెరుగైన వైద్యం అవసరమైన పేషెంట్లను ఫ్యామిలీ డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్‌  క్లీనిక్‌ ద్వారా ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు రిఫర్‌ చేయడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన రోగులకు చికిత్సానంతర పర్యవేక్షణ కూడా ఫ్యామిలీ డాక్టర్‌ ద్వారా, విలేజ్‌ క్లీనిక్‌లో ఆరోగ్యశ్రీ రిఫరల్‌ సేవలు కూడా అందిస్తారు.

Also Read : Jaganannaku Chebudam: ఏప్రిల్ 7నుంచి జగనన్నే మా భవిష్యత్తు

RELATED ARTICLES

Most Popular

న్యూస్