రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పర్యటించనున్నారు. విద్యార్థుల ఫీజు రీఇంబర్స్‌మెంట్ ను అందించే జగనన్న విద్యా దీవెన పథకం కింద ఈ ఏడాది రెండో త్రైమాసికం ఫీజులను నేడు అందించనున్నారు. జులై – సెప్టెంబర్ 2022 త్రైమాసికానికి 11.02 లక్షల మంది విద్యార్ధులకు రూ. 694 కోట్లను బటన్ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 12,401 కోట్లకు చేరుకుంది. దీనిలో గత ప్రభుత్వ బకాయిలు దాదాపు రూ.1,778 కోట్లు, జగనన్న విద్యా దీవెన క్రింద రూ. 9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన క్రింద రూ. 3,349 కోట్ల రూపాయలు ఉన్నాయి.
పేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేసేలా ఈ పథకంలో మార్పులు చేసింది.
మదనపల్లె లోని టిప్పు సుల్తాన్ గ్రౌండ్స్ లో జరిగే జగన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అక్కడే జరిగే బహిరంగ సభలో సిఎం జగన్ ప్రసంగించనున్నారు. అనంతరం ఆయన తాడేపల్లి బయల్దేరి వెళతారు.